బ్రేకింగ్… గిరిజనుల రిజర్వేషన్ పెంపు
ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana government has increased the reservation for tribals: తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి ఈ రిజర్వేషన్లు పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు విడుదల చేశారు.
దీంతో శనివారం నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి రానుంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో.. 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో.. రాష్ట్రంలోని గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతం రిజర్వేషన్ల విధానాన్నే ఇప్పటిదాకా కొనసాగించారు. తాజాగా ఉత్తర్వులతో.. రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి.