ఆ నేతలు… జాతీయ రాజకీయాల్లోకి…
-ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లనున్న పలువురు నేతలు
-బాల్క సుమన్ వెళ్తారా...? కేటీఆర్ టీంలో ఉండిపోతారా..?
-గొడం నగేష్ సైతం బీఆర్ఎస్‌లోకే..
-మరికొందరు నేతలపై దృష్టి సారించిన అధినేత
Joint Adilabad district leaders into national politics: మరో రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీగా అవతరించనున్న టీఆర్ఎస్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేతలు ఎవరు అనే దానిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు, జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు అన్ని రకాలుగా అర్హులైన వారి కోసం అధినేత ఇప్పటికే పూర్తి స్థాయిలో జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ బలోపేతం వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లాల వారీగా నేతల జాబితా రూపొందించారు. తనతో పాటు జాతీయ పార్టీలోకి ఎవరెవరిని తీసుకువెళ్తే. మేలు జరుగుతుందనే విషయంలో చర్చలు జరిపి.. టీంను రూపొందించే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారని తెలుస్తోంది.. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒకరిద్దరూ ముఖ్య నేతలను తనతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి తీసుకు వెళ్లే విషయంపై సూచనప్రాయంగా చర్చించినట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా హిందీ ధారాళంగా మాట్లాడాలి… అదే సమయంలో ఇతర ప్రాంతాల ప్రజలు, నేతలతో సత్సబంధాలు ఉండావారు కావాలి. ఇది ఇక్కడి నేతలకు వరంగా మారే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ కు చుట్టూ మహారాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. ఇక్కడి ప్రజలతో అక్కడి వారు, అక్కడి వారితో తెలంగాణ ప్రాంత వాసులకు చుట్టరికం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు తెలుగు, హిందీ, మరాఠీ భాషలు సైతం ఇక్కడి నేతలకు కొట్టిన పిండే. దీంతో ఈ ప్రాంతానికి చెందిన నేతలకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు హిందీ, మరాఠీ వచ్చా..? అనే విషయంలో ఇప్పటికే నేతలను అడిగి వివరాలు సేకరించినట్లు సమాచారం.
బాల్క అటు వెళ్తారా..? కేటీఆర్ తో ఉంటారా..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వెళ్లే నేతల్లో మొదటగా వినిపించే పేరు బాల్క సుమన్‌దే. ఆయన గతంలో ఎంపీగా చేసిన అనుభం కూడా ఉంది. హిందీ,ఇంగ్లీషు ధారాళంగా రావడమే కాకుండా విద్యార్థి నేతగా గుర్తింపు పొందారు. అధినేతపై ఈగ వాలకుండా ప్రతిపక్షాలపై అంశాల వారీగా దుమ్మెత్తిపోయడంలో అందె వేసిన చేయి. ఈ నేపథ్యంలోనే ఆయనను ఖచ్చితంగా జాతీయ రాజకీయాలోకి తీసుకువెళ్తానే ప్రచారం సాగుతోంది. మరోవైపు బాల్క సుమన్‌ను కేటీఆర్ వదులుకుంటారా..? అనేది కూడా అనుమానమే. ఈ నేపథ్యంలో సుమన్ ఎటు వైపు వెళ్లారనేది ప్రశ్నగా మారింది.
ఎంపీగా గొడం ఖాయం..
ఇక తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న గొడం నగేష్ సైతం చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ ఎంపీగా సైతం పనిచేశారు. గిరిజన నేతగా, వివాదరహితుడిగా ఎంతో పేరుంది. దేశవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల ఓట్ల సమీకరణలో ఇలాంటి నేతలు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఆయనను ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు తీసుకువెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలూరి గోవర్ధన్, లోక భూమారెడ్డి పేర్లు సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది.
బహు బాషా ప్రావీణ్యం.. సుభాష్‌రావు సొంతం..
చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి పట్టున్న నేతగా నిర్మల్ జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావుకు పేరుంది. ఆయన చదివింది నాగ్‌పూర్‌లో. ఆయన అత్తగారు కర్ణాటక. అమ్మమ్మ వాళ్ల ఊరు నాందేడ్. నాందేడ్ జిల్లాలో ఆయనకు చుట్టాలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయనకు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. అదే సమయంలో అందరితో కలుపుగోలుగా ఉంటారనే పేరుంది. ఇది కూడా అయనకు కలిసివచ్చే అవకాశంగా మారనుంది.
ఇక ఆసిఫాబాద్ నుంచి సైతం పలువురి పేర్లు అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. ఇప్పటికే అటు సన్నిహితులు, నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారని సమాచారం.