ఖాకీల దసరా అక్రమ వసూళ్లు
దసరా పండగ సందర్భంగా పోలీసులు మామూళ్లు షురూ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు వసూళ్లకు తెగబడ్డారు. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. స్థానిక వ్యాపారులు, షాపింగ్ మాల్స్ దగ్గర వసూళ్లకు పాల్పడ్డారు. అయితే పై అధికారులకు తెలిసే ఇది జరిగిందని చెప్తున్నారు. తెలియకుండా ఆ స్థాయిలో వసూళ్లు చేసే ఆస్కారమే లేదని పలువురు అంటున్నారు.
ఈ నేపథ్యంలో విషయం రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి విషయం చేరింది. కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి వన్ టౌన్ కానిస్టేబుళ్లు కామిరెడ్డి సురేష్, బద్ది విద్యాసాగర్ లను కమిషనరేట్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం లో అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం.
గతంలో జరిగిన ఓ ఘటనలో సురేష్ ని ఇక్కడ నుండి బదిలీ చేశారు. కానీ తనకు ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చారు. కొందరు అధికారులు సైతం ఆయన ఇక్కడకు వచ్చేందుకు సహకరించినట్లు తెలుసుతోంది.