‘చే’ జారుతున్న నేతలు
-వచ్చిన వారిని కాపాడుకోలేని కాంగ్రెస్
-పార్టీలోకి వచ్చినా వెనక్కి వెళ్లిపోతున్నారు
-అసమ్మతి నేతలతో రేవంత్‌కు తలనొప్పి
-వచ్చిన దారినే వెనక్కి వెళ్లిన నల్లాల ఓదెలు దంపతులు
-వస్తారనుకున్న గద్దర్ కూడా ప్రజాశాంతిలోకి..
-ఇక ముందు వలసలు రావడం కష్టమే
Leaders who are leaving the Congress party: కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతాయని, టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలన్నీ ఉత్తవే అని తేలిపోయింది. కొత్తగా పార్టీలోకి వచ్చే వారితో జోష్ నిండుతుందని అంతా భావించారు. కానీ, ఎక్కడా ఆ పరిస్థితి లేదు. పైగా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారే వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో కుదేలవుతోంది. దీంతో అధిష్టానం పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించింది. ఆయన పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. మొదట్లో కాస్తంత హడావిడి కనిపించింది. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొందరు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు వస్తాయని అందరూ భావించారు. కానీ కొద్ది రోజుల్లోనే సీన్ రివర్స్ అయ్యింది. వచ్చిన నేతలు వచ్చినట్లుగాన వెనక్కి వెళ్లిపోతున్నారు. కొత్త వాళ్లు పార్టీలోకి రావాలంటేనే భయపడుతున్నారు.
దీనికి చాలా కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో మొదటిది స్థానికంగా ఉన్న అసమ్మతి. రాష్ట్ర స్థాయిలో నేతలు జిల్లాల వారీగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. వారు వచ్చినా జిల్లాల్లో ఉన్న గ్రూపులతో భయపడి సైలెంట్ గా ఉండటమో లేకపోతే వెనక్కి వెళ్లిపోవడమో చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న చాలా మంది సైతం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్ వైపు అటు టీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి కానీ నేతలు రావడం కష్టమేనని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు రాజకీయానాకి భయపడి నాలుగు నెలల్లోనే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక మంచిర్యాలకు వచ్చిన గద్దర్‌తో పెద్దపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ప్రేంసాగర్ రావు కోరారు. సరే అని చెప్పిన గద్దర్ తిరిగి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనను పార్టీలోకి తీసుకురావడంలో కూడా నేతలు విఫలమయ్యారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కేవలం ఇక్కడి పరిస్థితి మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం దేముడెరుగు.. అందులో నుంచి ఎప్పుడు బయటపడదామా..? ఎదురు చూస్తున్నారు. మరి టీ పీసీసీ చీఫ్ ఏం చేస్తారో..? వేచి చూడాల్సిందే.