సై అంటే సై..
-మంచిర్యాలలో రెండు పార్టీల హల్‌చల్
-టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న కాంగ్రెస్
-చివరి వరకు కాపాడుకుంటారా..? అని హస్తం నేతల అనుమానాలు
-ప్రేంసాగర్ రావు వన్‌మాన్ షోతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇబ్బందులు
-ఆయన ప్రవర్తన మారితే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని వెల్లడి
-అధికార పార్టీకి ఇబ్బందిగా మారిన భారీ వరదలు
-బీజేపీ దూసుకుపోతున్నా.. రేసులో మూడో స్థానమే
-నియోజకవర్గ ముఖచిత్రం - 3

Congress and TRS clash in Mancharyal: మంచిర్యాల నియోజకవర్గంలో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా..? నేనా…? అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఇప్పుడే ఎన్నికలు ఉన్నాయనే విధంగా పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పంచ్‌లు విసురుకుంటున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కదం తొక్కుతుంటే, కాంగ్రెస్ పార్టీపై అదే స్థాయిలో టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇక ఇక్కడ బీజేపీ అడపాదడపా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా మూడో స్థానానికే పరిమితం అవుతోంది.
అధికార టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజవర్గంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నది. ఆ పార్టీ అభివృద్ధి పనులు చేసినా, కొన్ని సందర్బాల్లో తప్పిదాల వల్ల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా భారీగా వచ్చిన వరదలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఆ విషయంలో అధికార పార్టీ కొంత మేర స్పందించినా అనుకున్న స్థాయిలో సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించి పనులు చేయించాల్సిన ఎమ్మెల్యే అధికారులను ప్రజల వద్దకు పంపించడంలో తాత్సారం చేశారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఆయన తనయుడు విజిత్ తో పాటు పలువురు నేతలు ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించినా అది అధికార పార్టీకి కొంత మైనస్‌గానే మారింది.
మరోవైపు గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణా కేంద్రం విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. వరదలు తీవ్రమైన రోజు అదే రోజు ఆపరేషన్ చేసిన ఆడబిడ్డలను, రోజుల బాలింతలను తరలించారు. అసలు ఆ కేంద్రం అక్కడమే తప్పని దీని గురించి అధికార పార్టీ కావాలనే చేసిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇలా అధికారపార్టీ చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సోషల్‌మీడియాలో వార్తలను షేర్ చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ ఈ విషయంలో కాస్తంత వెనకపడిందనే చెప్పాలి.
అయితే గతంతో పోల్చితే ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి కొనసాగుతోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో శ్రీరాంపూర్ ఏరియాలో ఆరు వేలకు పైగా పట్టాల పంపిణీ చేశారు. ఇక అంతర్గాం వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నర్మించాలని దశాబ్దాలుగా మంచిర్యాల వాసులు కోరుతున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరిగితే రవాణా పరంగా ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు వంద పడకలకు సంబంధించి వైద్య కళాశాల ఏర్పాటుకు సైతం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది. అది కూడా ఎమ్మెల్యే ఖాతాలో చేరుతుంది. వాస్తవానికి ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఎమ్మెల్యే దివాకర్‌రావు, పెద్దపల్లి ఎంపీతో కలిసి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి ఇక్కడ మెడికల్ కళాశాల ఓకే చేయించారు.
ఇక్కడ అభివృద్దితో పాటు మైనస్‌లను సైతం ప్రజలు లెక్క వేసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. అంతర్గతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే. కాబట్టి నేతలు చేజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని పలువురు స్పష్టం చేస్తున్నారు.
మంచిర్యాల నియోజకవర్గం.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మంది నేతలు గెలుపొందారు. అయితే గత నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన కాలంలో ఆ పార్టీని ఆదరించిన ప్రజలు అప్పటి నుంచి గులాబీ పార్టీకి పట్టం కడుతూ వచ్చారు. అయితే ఇంత జరిగినా హస్తం పార్టీ ఛరిష్మా తగ్గడం లేదు. నియోజకవర్గంలో లక్ష్సెట్టిపేట, దండేపల్లితో కొత్తగా ఏర్పడిన హాజీపూర్ వరకు ఆ పార్టీ చాలా బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అధికార పార్టీకి కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఇక్కడ కొంచం కష్టమైన పరిస్థితులనే ఎదుర్కొంటోంది. బలమైన ప్రత్యర్థిగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఢీ కొడుతున్నారు. ఏ కొంచం ఛాన్స్ దొరికినా ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో సాధారణంగానే మంచిర్యాల నియోజకవర్గంలో నిత్యం ఎన్నికల వాతావరణం తలపిస్తోంది.
అయితే ఆ పార్టీ నేత ప్రేంసాగర్ రావు ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఆయన పార్టీ పేరు కంటే కూడా వ్యక్తిగత ప్రచారానికి తహతహలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నిర్వహిస్తున్నారు. అది కాస్తా కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ అవుతోంది. అంతేకాకుండా ప్రేంసాగర్ రావు తీరు నచ్చక చాలా మంది నేతలు దూరం అవుతున్నారు. ప్రజల్లో పట్టున్న నేతలు దూరం అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి సైతం గెలుపు దూరం అవుతోందన్న అపవాదు ఉంది. అదే సమయంలో ఆయన సొంత పార్టీలోనే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. తాను సొంతంగా పార్టీ పెడతానని ఆయన చేసిన ప్రకటన సైతం గందరగోళానికి దారి తీసింది. చాలా మంది నేతలు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన నిలకడలేని తనం వల్ల కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు దూరం అవుతున్నారు. మరోవైపు పార్టీలో చేరాలనుకునే వారు సైతం అటు వైపు చూడటం లేదు. ప్రేంసాగర్ రావు మారితే ఖచ్చితంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. కానీ ఆయన మారుతారా..? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సైతం తన దూకుడు పెంచింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ముందుకు సాగుతోంది. వెరబెల్లి రఘునాథ్ రావు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. అయితే, ఆ స్పీడ్ సరిపోదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఆ పార్టీలో సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అది కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందరినీ కలుపుకుని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు మరింత దూకుడుగా చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అవకాశం ఉంటుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. మరి వారు ఎలా ముందుకు వెళ్లానేది చూడాలి.