ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దు
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

Don’t be fooled by buying government lands: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములలో కొందరు వెంచర్లు ఏర్పాట్లు చేసి అక్రమంగా ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగు సమీపంలో ప్లాట్ల ఏర్పాటు కొరకు చదును ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి భూములను ప్రజలు కొనుగోలు చేయవద్దని కోరారు. జిల్లాలోని మంచిర్యాల శివారులో గల రాళ్ళవాగు కాలువ చాలా సంవత్సరాల క్రితం తన గతి మార్చుకుందన్నారు. దీంతో ఈ కాలువ భూమి సర్వే నం.140, 141 ప్రక్కన గల భూములను ఆక్రమణదారులు చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు యత్నించారని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేయడంతో ఆర్డీవో, తహశిల్దార్, నీటిపారుదల శాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ట్రెంచ్ కొట్టించి, మొక్కలు నాటించడంతో పాటు ప్రభుత్వ భూమి సూచిక బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాళ్ళవాగు సమీపంలో సర్వే నం.140,141 ప్రక్కన భూములను ఎవరైనా పట్టా భూమిగా చూపించి విక్రయాలకు ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరు ఇలాంటి భూములను కొనుగోలు చేయవద్దన్నారు.