డెన్ కనబడుట లేదు…
A twist in the smuggling of ration rice: జాతీయ రహదారి పక్కనే అక్రమ సామ్రాజ్యం.. కోట్లాది రూపాయల దందా.. పదుల సంఖ్యలో లారీలు.. అక్కడే వంట చేసుకుని తింటున్న కూలీలు.. ప్రతి సామాన్యుడికి అది కనిపిస్తుంది… కానీ, జిల్లాలోని ఉన్నతాధికారులు, పోలీసులకు మాత్రం ఆ డెన్ కనిపించడం లేదంట… ఎందుకో మరి..?
తెలంగాణలోని రేషన్ బియ్యం అక్రమంగా తరలించుకుపోయి, వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న మాఫియా డాన్ తన సామ్రాజ్యాన్ని ప్రాణహిత తీరం ఆవల మహారాష్ట్రలో ఏర్పాటు చేసుకున్నాడు. తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి నిత్యం కోట్లాది రూపాయల దందా చేస్తుంటాడు. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిస్తాడు. పెద్ద సంఖ్యలో లారీలు, డీసీఎం వ్యాన్‌లు ఇక్కడికి వస్తుంటాయి.
ప్రాణహిత తీరం దాటగానే సిర్వంచలో తన డెన్ ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు సివిల్ సప్లై అధికారులు అప్పుడప్పుడు బియ్యం అక్రమ రవాణా చేస్తున్న చిన్న చిన్న వ్యాపారులపై కేసులు పెడుతున్నారు. ఈ రవాణాకు మూల కారణమైన సిర్వంచ డాన్‌పై సైతం కేసులు నమోదు చేశారు. కానీ, అతన్ని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఇక సివిల్ సప్లై అధికారులు అయితే ఏకంగా బియ్యం సిర్వంచకు వెళ్తున్నాయి వాటిని కనీసం పట్టుకోవడం లేదని వాటిని వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆ డెన్ అధికారులకు కనిపించకపోవడం వెనక మొత్తం మామూళ్ల వ్యవహారమే అని చెబుతున్నారు. పోలీసులకు, సివిల్ సప్లై అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముడుతున్నాయని అందుకే ఆ డాన్ విషయంలో పట్టించుకోవడం లేదని పలువురు దుయ్యబడుతున్నారు. నాలుగు జిల్లాల నుంచి బియ్యం రవాణా సాగుతున్నా కనీసం అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులకు ఆ డెన్ కనబడుతుందో లేదో..? బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ఆ డాన్‌ను అరెస్టు చేస్తారో లేదో..? వేచి చూడాలి మరి…