సింగరేణి ప్రైవేటీకరణ పై తప్పుడు ప్రచారం
-అవినీతిపై కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడటం లేదు..?
-బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్
False propaganda on privatization of Singareni: సింగరేణి ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ అన్నారు. బుధవారం మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తోందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. సంస్థలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వం వాటా 49 శాతం ఉందన్నారు. ఇలా ఉంటే కేంద్రం సింగరేణి ప్రైవేటీకరణ ఎలా చేయగలుగుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు.
సింగరేణి కోసం టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని అందుకే సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 2015 ప్రైవేటీకరణ బిల్లుకు పార్లమెంట్ లో బాల్క సుమన్, కల్వకుంట్ల కవిత ఇద్దరు ఓటు వేశారని ఆ విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అంతేకాకుండా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర కంపెనీకి అంటకంటిందన్నారు. ఒరిస్సాలో రెండు ఓపెన్ కాస్ట్ లను సింగరేణి వేలంలో దక్కించుకొందన్నారు.
మరి ఇక్కడ బ్లాక్ ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరగకుండా రాత్రికి రాత్రి జీవోలు తీశారని రఘునాథ్‌రావు అన్నారు. సింగరేణి కార్మికులకు ప్రత్యేకంగా క్వార్టర్లు కట్టిస్తామన్నారని, కాని కట్టించలేదని దుయ్యబట్టారు. కార్మికుల మారు పేర్ల గురించి సైతం పట్టించుకోలేదన్నారు. సింగరేణిలో అవినీతి కుంభకోణాలు జరుగుతూ ఉంటే కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, సింగరేణి ప్రైవేటీకరణ విషయంపై బాల్క సుమన్ బహిరంగ చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, అగల్ డ్యూటీ రాజు, పెద్దపెల్లి పురుషోత్తం, కోడి రమేష్, మల్లికార్జున్, మల్లేష్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.