కదిలిన ఖాకీలు
-నాంది కథనాలతో బియ్యం అక్రమ రవాణాపై దృష్టి
-అన్ని విషయాలను ఆరా తీసిన డీసీపీ అఖిల్ మహాజన్
-నేడు రేషన్ డీలర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం
-మాకు కమీషన్లు సక్రమంగా రావడం లేదు : డీలర్ల ఆవేదన
Police moved on rice smuggling: బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ఏండ్లుగా యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారంపై నాంది న్యూస్ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఈ అక్రమ దందాపై మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆరా తీయడమే కాకుండా, ముందస్తుగా రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్ హాల్‌లో జిల్లాలో ఉన్న అందరు రేషన్ డీలర్లు హాజరు కావాలని సమాచారం అందించారు.
మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఇక్కడ కొందరు వ్యాపారులు బియ్యం కొని మహారాష్ట్రలోని సిర్వంచకు తరలిస్తున్నారు. అదే సమయంలో రేషన్ డీలర్లు సైతం బియ్యం కార్డు దారుల వద్ద వేలిముద్ర వేయించుకుని బియ్యం నేరుగా అమ్మేస్తున్నారు. ఇలా అన్ని రకాలుగా బియ్యం సరిహద్దులు దాటుతోంది. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు సైతం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని శాఖలకు ఆ స్థాయిలో ముడుపులు ముట్టడం వల్ల పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు తమకు కమీషన్లు సక్రమంగా రావడం లేదని చౌక ధరల దుకాణాల డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలల పాటు కొన్ని సందర్భాల్లో నాలుగు నెలల పాటు బియ్యం పంపిణీకి సంబంధించి కమీషన్లు ఇవ్వడం వారు చెబుతున్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ చేయడంతో కమీషన్లు సరిపోవడం లేదనే చెబుతున్నారు. నెలలో 100 క్వింటాళ్లు సరఫరా చేసే డీలర్‌కు రూ. 10వేల కమీషన్ వస్తుంది. ఇందులో గది కిరాయి కనీసం రూ. 2 వేలు, గమాస్తాకు రూ. 3 వేలు ఇవ్వాలి. మిగతా రూ. 5 వేలతోనే డీలరు నెలంతా గడపాల్సి వస్తోంది. బియ్యంతోపాటు చక్కెర, గోధుమలు, పప్పులు తదితర సరుకులు పంపిణీ చేస్తే లాభసాటిగా ఉంటుందని డీలర్లు చెబుతున్నారు.
ఇక ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి రైస్‌మిల్లులు కేంద్రంగా నడుస్తున్నాయి. ప్రభుత్వం రైతుల వద్ద వడ్లు కొని మిల్లింగ్‌కు ఇస్తోంది. అయితే రైస్ మిల్లుల యజమానులు మాత్రం వాటిని మిల్లింగ్ చేసి అమ్మేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తాము కొన్ని పాత రేషన్ బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇలా అవే బియ్యం తిరిగి తిరిగి రైస్ మిల్లులకు వస్తున్నాయి. ఈ విషయాలు తెలిసినా రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుని సైలెంట్‌గా ఉంటున్నారు.
కొద్ది రోజుల కిందట నిర్మల్ జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు పెద్ద ఉదాహరణ. నిర్మల్ జిల్లా బైంసా మండలం మాటేగాం వద్ద శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్ నుండి ఓ లారీలో 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం ముథోల్ మండలం ఎడ్ బీడ్ విఘ్నేశ్వర రైస్ మిల్ కు తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది సర్వసాధారణంగా మారింది. కానీ, అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే ఇలా జరుగుతోందనే ఆరోపణలు సైతం లేకపోలేదు.
ఏదిఏమైనా ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికైనా మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ దృష్టి సారించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట్లల్లో జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాలని కూకటి వేళ్లతో సహా ఈ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.