బ్రేకింగ్‌.. అంగ‌న్‌వాడీ సూప‌ర్ వైజ‌ర్ల భ‌ర్తీ రేపే

-అర్హుల‌కు స‌మాచారం అందించిన అధికారులు
-రేపు హైద‌రాబాద్‌లో నియామ‌క ప‌త్రాలు అంద‌చేత‌
-ఖాళీల వివ‌రాలు చెప్పాల‌ని జిల్లా అధికారుల‌కు స‌మాచారం

Anganwadi super viziers will be replaced tomorrow: ఎట్ట‌కేల‌కు అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. ప‌రీక్ష‌లు రాసి అర్హ‌త సాధించిన వారికి శ‌నివారం సూప‌ర్‌వైజ‌ర్లుగా నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్ర‌క్రియ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేయాల‌ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ పూర్తి చేశారు. శ‌నివారం వారికి నియామ‌క ప‌త్రాలు అందిస్తామ‌ని, వారు ఉద‌యం ప‌ది గంట‌ల లోపు హాజ‌రు కావాల‌ని అర్హులైన వారికి స‌మాచారం అందించారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రేడ్ 2 సూప‌ర్ వైజ‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ మొద‌టి నుంచి వివాద‌స్పదంగానే మారింది. దాదాపు ఏడేండ్ల త‌ర్వాత ఈ శాఖ‌లో సూప‌ర్‌వైజ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల‌ను ప్ర‌మోష‌న్ల ద్వారా భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో పరీక్ష‌లు ​ నిర్వహించి, 2014లో రిక్రూట్​మెంట్​ చేపట్టారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎట్టకేలకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేయడంతో అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు.

గ్రేడ్​-2 సూపర్​వైజర్​ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. మెయిన్​, మినీ సెంటర్ల అంగన్​వాడీ టీచర్లు, ఐసీడీఎస్​, ప్రాజెక్టులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ సూపర్​వైజర్లు, అంగన్​వాడీ ట్రెయినింగ్​ సెంటర్లలో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు, మిడిల్​ లెవల్​ ట్రైనింగ్​ సెంటర్స్​లో పనిచేస్తున్నవారు అర్హులని నోటిఫికేష‌న్‌లో తెలిపింది. టెన్త్​ పాసైన అభ్యర్థులు అంగన్​వాడీ టీచర్లుగా లేదా డిపార్ట్​మెంట్​లో పదేండ్ల సర్వీస్​ కలిగి, 50 ఏండ్ల లోపు ఉండాలని స్ప‌ష్టం చేసింది.

అభ్య‌ర్థులు ప‌రీక్ష‌లు రాసిన త‌ర్వాత అంతా తారుమారైంది. త‌మ‌కు అధికారులు ఒక‌టి చెప్పి, వాస్త‌వానికి జ‌రిగింది ఒక‌ట‌ని కొంద‌రు కోర్టుల మెట్లెక్కారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌నికి చెందిన టీచ‌ర్లు కోర్టులో పిటిష‌న్ వేశారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి గైడ్స్‌లైన్స్ లో 90 ప్ర‌శ్న‌లు, 45 మార్కులు అని చెప్పార‌ని, ప‌రీక్ష‌ల్లో మాత్రం ఒక్క ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు చొప్పున కేటాయించార‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. ప‌దవ త‌ర‌గ‌తి క‌నీస అర్హ‌తగా గ్రేడ్ 2 సూప‌ర్‌వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీకి చెప్పిన అధికారులు, ప‌రీక్ష‌ల్లో మాత్రం గ్రూప్ 1 స్థాయిలో ప్ర‌శ్నాప‌త్రం ఇచ్చార‌ని వాపోయారు. గ‌తంలో త‌మ శాఖ‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు త‌మ శాఖ వారే నిర్వ‌హించే ఆన‌వాయితీ ఉండేద‌ని, కానీ ఇప్పుడు మాత్రం జేఎన్‌టీయూ అధికారులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యాన్ని కోర్టుకు వెల్ల‌డించారు. త‌మ అభ్యంత‌రాలు సైతం ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు.

స్త్రీ, శిశు సంక్షేమ క‌మిష‌న‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ ఈ కేసు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని కోర్టులో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించారు. దీంతో కోర్టు సైతం వారితో ఏకీభ‌వించి టీచ‌ర్ల పిటిష‌న్ తోసిపుచ్చింది. ఈ నేప‌థ్యంలో గ్రేడ్ 2 సూప‌ర్‌వైజ‌ర్ల భ‌ర్తీ చేప‌ట్టాల‌ని భావించారు. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న వివ‌రాలు తీసుకున్న అధికారులు ఆ మేర‌కు ప్ర‌క్రియ చేప‌ట్టారు. శ‌నివారం నేరుగా నియామ‌క‌ప‌త్రాలు వారి చేతికే అందించ‌నున్నారు.

వాస్త‌వానికి కోర్టు తీర్పు వ‌చ్చి చాలా రోజులు అయినా స్థానికత తదితర అంశాలపై స్పష్టత కోసం వారి సర్టిఫికెట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో నిర్ధారణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఫలితాల ప్రకటన తర్వాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరీశీలనకు ఉపక్రమించింది. అందుకే ప్ర‌క్రియ కాస్తా ఆల‌స్యం అయ్యింది. అయితే, ఈ విష‌యంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ కృషి అంద‌రూ అభినందిస్తున్నారు. ఆమె ప్ర‌త్యేకంగా చొర‌వ తీసుకుని ప్ర‌క్రియ పూర్తి చేయ‌క‌పోతే స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారేద‌ని చెబుతున్నారు.

ఏది ఏమైనా నియామ‌క ప్ర‌క్రియ పూర్త‌యి త‌మ‌కు ఉద్యోగాలు రావ‌డం ప‌ట్ల ప‌లువురు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like