మూడు నియోజకవర్గాలు… 10 రోజులు… 114 కిలోమీటర్లు..
-ఇదీ బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర
-నిర్మల్ జిల్లా నుంచి కరీంనగర్ వరకు
-పలు పార్టీల నుంచి చేరికలు
-జోష్ నింపనున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి యాత్ర
Bandi padayatra will start from tomorrow: మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు.. 114 కిలోమీటర్ల మేర బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర కొనసాగనుంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర కరీంనగర్ వరకు కొనసాగుతుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భైంసాలో ప్రారంభ సభకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకానుండగా, పాదయాత్ర చివరి రోజున ఢిల్లీ పెద్దలను పిలిపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో సోమవారం ప్రారంభం కానున్న ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతానికి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. రేపు ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు ఆదివారం రాత్రే బండి సంజయ్ జిల్లాకు చేరుకుంటారు. సోమవారం ఉదయం సారంగాపూర్ మండలం ఆడెల్లి మహా పోచమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భైంసాలో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. యాత్రకు జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్యకర్తలు, లీడర్లు తరలివచ్చే అవకాశం ఉంది. పాదయాత్రలో భాగంగా జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్ లో బహిరంగ సభల్లో బండి సంజయ్ మాట్లాడుతారు.
ఎనిమిది రోజుల పాటు యాత్ర…
భైంసాలో ప్రారంభమయ్యే యాత్ర జిల్లాలో ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. మాగామ, లింబ, ఓల, కుంటాల, అంబకంటి, నర్సాపూర్, నిర్మల్ పట్టణంలోని శాంతినగర్, వెంకటాపూర్, లక్ష్మణచాందా, మామడ, ఖానాపూర్ వరకు పాదయాత్ర ఉంటుంది. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ కాషాయం కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. పెంబి ఎంపీపీ భూక్య కవిత ఆమె భర్త టీఆర్ఎస్ సీనియర్ లీడర్ గోవిందు బీజేపీలో చేరే అవకాశం ఉంది.
పోలీసుల ప్రత్యేక బందోబస్తు..
బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మతపరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు ఈ యాత్రపై దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా దృష్టి సారించారు.