నిర్మల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తత
-బండి సంజయ్ పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ
-ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ నేతల ఆందోళన

The situation is tense in front of the Nirmal SP camp office: నిర్మల్ జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భైంసాలో శాంతి భద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. బలవంతంగా నాయకులను స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టే పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం సిగ్గుచేటని విమర్శించారు. శాంతి భద్రతల పేరుతో పోలీసులు కావాలని యాత్రకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అత్యుత్సాహం నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు.