కడుపుకొడుతున్నరు…
సరుకులు అమ్ముకుంటున్న అంగన్వాడీ టీచర్లు - అండగా ఉంటున్న సూపర్వైజర్లు - కంట్రాక్టర్ల నుంచి ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు - లబ్ధిదారులకు అందని సరుకులు

మంచిర్యాల – నిజంగానే పేదోళ్ల కడుపుకొట్టి అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు తమ జేబులు నింపుకుంటున్నారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇవ్వాల్సిన సరుకులు అమ్ముకుంటున్నారు. ఈ విషయంలో నిత్యం పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు సైతం మామూళ్లు తీసుకుని అవినీతిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలింతలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె, వారానికి 4 కోడిగుడ్లు అందజేస్తున్నారు. 3-6 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రం మధ్యాహ్నం ఒక్కపూట అన్నం, కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం అందించాల్సి ఉంది.
అంగన్వాడీ కేంద్రాల్లో పేదలకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అందజేస్తున్న సరుకులను స్వాహా చేస్తున్నారు. ఇందులో అందరి హస్తం ఉండటంతో వ్యవహారం ఎక్కడా బయటపడటం లేదు. లబ్ధిదారులు ఎన్నిసార్లు ఆరోపణలు చేసినా కనీసం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పేదలకు అందాల్సిన పౌష్టికాహారం అందని ద్రాక్షపండులా మిగిలిపోతోంది. పేద మహిళలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందక మృత్యువాతపడుతున్నారు. అనారోగ్య శిశువులకు జన్మనిస్తున్నారు.
కోడిగుడ్ల పేరుతో లక్షలు స్వాహా..
వాస్తవానికి కంట్రాక్టర్ దగ్గర నుంచే అక్రమాలకు తెర తీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిట్టగుడ్డంత కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రా క్టర్ సరఫరా చేస్తున్న గుడ్లు ఒక్క బుక్కతో నమలకుండానే మింగే సైజులో ఉన్నాయి. ప్రతి నెలా రెండు విడతలుగా జిల్లాలో మూడు లక్షల అరవై వేల వరకు గుడ్లు అందచేస్తున్నారు. వాస్తవానికి కోడిగుడ్డు 50 గ్రాముల కంటే తక్కువగా ఉంటే వాటిని అంగన్వాడీ సిబ్బంది తిరస్కరించాలి. కానీ అలా చేయడం లేదు. ఒక్కో గుడ్డుకు రూపాయి చొప్పున సూపర్వైజర్లకు ముట్టచెబుతున్నట్లు సమాచారం. దీంతో అంగన్వాడీ టీచర్లు వాటిని తీసుకుంటున్నారు. ఇక చాలా మంది అంగన్వాడీ టీచర్లు తీసుకున్నట్లు లెక్కచూపుతూ వాటికి తిరిగి కంట్రాక్టర్కే ఇస్తున్నారు. ఒక్కో గుడ్డుకు రెండు రూపాయలు కంట్రాక్టర్ అక్కడే చెల్లిస్తుండటంతో వారి పని సులువు అవుతోంది.
పాలపాకెట్లు స్వీట్ హౌస్‌లకు..
ఇక పాలపాకెట్లు అన్నీ స్వీట్‌హౌస్‌లకు తరలుతున్నాయి. ఒక్కో పాలపాకెట్ లీటర్ చొప్పున పన్నెండు పాకెట్లు కలిపి ఒక కాటన్లో అందచేస్తారు. ఈ పాలపాకెట్ల కాటన్ రూ. 300 అమ్ముకుంటున్నారు. ఆ ప్యాకింగ్ కవర్లు బయటకు కనపకుండా మానేజ్ చేస్తున్నారు. ఇక పప్పు, నూనె సైతం అమ్ముకుంటున్నారు. బియ్యం కూడా గతంలో కాకుండా సన్న బియ్యం వస్తుండటంతో వాటిని సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా బయటకు పొక్కకుండా సూపర్వైజర్లు అండగా ఉంటున్నారు. ప్రతి నెలా వారికి పెద్ద ఎత్తున ముడుపులు అందుతుడటంతో అంగన్వాడీ టీచర్లు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
కార్యకర్తలకు తప్పని వేధింపులు:
ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లు చాలాకాలం నుంచి పాతుకుపోయి ఉండడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమ మాటకు ఎదురుచెప్పే కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. చాలామంది సూపర్వైజర్లు సరుకుల్లో కోత పెట్టడాన్ని ప్రశ్నించిన కార్యకర్తలకు వేధింపులు తప్పడం లేదు. పైగా అమృతహస్తం బిల్లులు, ఇంటి అద్దెలు, కట్టెల బిల్లులు, ఇతర బిల్లుల్లో పర్సంటేజీలను ముక్కుపిండి వసూలుచేస్తున్నారు. కొంతమంది సూపర్వైజర్ల వసూళ్లపర్వంపై కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ప్రయోజనం శూన్యం.
అంగన్వాడీలు అమ్ముకునే రేట్లు ఇవి…
కోడిగుడ్డు 2 రూపాయలు
పప్పు 1 కిలో 50
నూనె పాకెట్ లీటర్ 50
బాలామృతం ప్యాకెట్ 20
పాల ప్యాకెట్ కాటన్ (12 లీటర్లు) రూ.300
మురుకులు గ్లాస్ 5 రూపాయలు
బియ్యం రూ. 10 కిలో