మంత్రిపై ముప్పేట ముట్టడి
-భూ కబ్జాలు, అవినీతిపై ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన బీజేపీ
-నిరూపించి తీరుతామని ప్రతిజ్ఞలు
-రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి
-ఆరోపణలు నిరూపిస్తామని సవాల్
-తాను సైతం సిద్దమేనన్న మంత్రి
-నిర్మల్ జిల్లాలో రగులుతున్న రాజకీయ వేడి
BJP and Congress are attacking the Minister IK Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు టాపిక్ అంతా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురించే…. ఆయనపై చేసిన ఆరోపణల గురించే.. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రిపై భూ కబ్జాలు, అవినీతి గురించి ఆరోపణలు చేయడమే కాకుండా వాటిని నిరూపిస్తామని ప్రకటించాయి. దీంతో నిర్మల్ జిల్లాలో రాజకీయంగా వేడెక్కింది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి పరుడు… కబ్జాల రాయుడు.. మా వద్ద ఆధారాలు ఉన్నాయి… ఇవీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు. డీ 1 పట్టాలు ఎవరి పేరు మీద ఉన్నాయి. చెరువు కబ్జాలు చేసింది మంత్రి బంధువులే… ఇది ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆరోపణలు.. బండి పాదయాత్ర సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఆయన అవినీతి, భూకబ్జాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మంత్రి చెరువులు కబ్జాలు చేస్తున్నారని, డీ 1 పట్టాలు ఆయన కుటుంబం పేరుతో చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రితో పాటు ఆయన అల్లుడి కబ్జాలకు అంతే లేదని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేశారని అవినీతి తిమింగలం మంత్రి అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.
మరోవైపు ఏఐసీసీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆయన కూడా అదే స్థాయిలో మంత్రి అవినీతిపై ఆరోపణలు గుప్పించారు. ఈ అవినీతిపై ఆయన గతంలో ఆందోళన సైతం నిర్వహించారు. తాజాగా మంత్రి భూ కబ్జాలు, ఆయన బంధువులు ఇష్టారాజ్యంగా నిర్మల్‌ను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోఫీనగర్‌తో పాటు చెరువులు చెరబట్టారని దుయ్యబట్టారు. ఒకవేళ అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని లేకపోతే మంత్రి రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ నేతలపై ఎదురుదాడికి దిగారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నానని, తన అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ మీరు నిరూపించకుంటే మీరు సైతం రాజకీయాల నుంచి తప్పుకోవాలని బీజేపీ నేతలకు ప్రతి సవాల్ విసిరారు మంత్రి అల్లోల. దమ్ముంటే డబ్బులు తీసుకున్నది ఎవరో..? పది రోజుల్లో రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే అదే సమయంలో మంత్రిపై తిరిగి బీజేపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఇవిగో తమ ఆరోపణలకు ఆధారాలు అంటూ డీ 1 పట్టాల్లో అల్లోల పేరుతో ఉన్న వాటిని విలేకరుల ముందు చూపించారు. మరోవైపు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలకు సంబంధించి బాధితులే ప్రత్యక్ష సాక్ష్యమని వారు స్పష్టం చేశారు. మరోవైపు జనవరి 10 వరకు డెడ్‌లైన్ పెట్టారు. ఎప్పుడైతే డీ 1 పట్టాల్లో తమ బంధువుల పేర్లు చూపించారో అప్పుడు మంత్రి సైలెంట్ అయ్యారనే ప్రచారం సాగుతోంది. ఆయన పర్యటన సైతం మీడియాకు చెప్పకుండా సాగిస్తున్నారని పలువురు చెబుతున్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలు, అవినీతి విషయంలో జరుగుతున్న చర్చను బీజేపీ చీప్ బండి సంజయ్ నిప్పు రాజేశారు. ఈ వివాదానికి ఏఐసీసీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఆజ్యం పోశారు. అదే సమయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తనపై ఆరోపణలు నిరూపించాలని నిలబడటంతో నిర్మల్‌లో రాజకీయ వేడి రాజుకుంది. ఈ రాజకీయ వేడి ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాలి మరి….