కొత్త ఓపెన్‌కాస్టు గనుల ప్రారంభం అత్యవసరం
వచ్చే ఏడాది 750 లక్షల టన్నుల వార్షిక లక్ష్యం సాధించాలంటే ఓసీల ఆవశ్యకత - ఈ మార్చి నాటికి కొత్త వాటి ప్రారంభానికి సిద్దం చేయండి సింగరేణి సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం
హైదరాబాద్ – సింగరేణి వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓపెన్ కాస్టు గనులను సకాలంలో ప్రారంభించాలని, వీటికి సంబంధించి పనులను ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాలని సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి ఆయన ఏరియాల జనరల్ మేనేజర్లతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక నిర్దేశించారు.
ఈ ఏడాది చివర లో ఉత్పత్తిని ప్రారంభించనున్న జీడీకే ఓపెన్ కాస్ట్ గని, ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్, ఉత్పత్తి సామర్థ్యం పెంపు జేవీఆర్ ఓపెన్ కాస్టు -2 తో పాటు 2022- 23 లో మరో 5 ఓపెన్ కాస్ట్ గనులను సింగరేణి ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్తగూడెం ఏరియాలో వీకే ఓపెన్ కాస్ట్ గని, రామగుండం ఏరియాలో ఆర్జీ ఓసీ గని, బెల్లంపల్లి ఏరియా లో గోలేటి, ఎంవీకే ఓపెన్ కాస్ట్ గనులు, ఇల్లందు ఏరియాలో రొంపెడు ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. తొలి ఏడాది 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని ప్రాథమికంగా కంపెనీ నిర్ణయించింది.
ఈ గనులకు సంబంధించి పలు అనుమతులు ఇప్పటికే వచ్చాయి. వీటికి సంబంధించి ఇంకా కొన్నిఅనుమతులు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రతి కొత్త గనికి సంబంధించిన అంశాల పై చర్చించారు. కొత్త గనుల ప్రారంభానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఈ ఏడాది మార్చిలో గానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంకా మిగిలిన అనుమతులు , భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలు పరిష్కరించుకోవాలని, గనులకు కావాల్సిన యంత్రాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తదితర పనులకు కాంట్రాక్ట్ ఏజెన్సీల నియామకం వంటివి పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వీటితో పాటు ఈ ఏడాది చివర లో ప్రారంభం కానున్న ఒడిశాలోని నైనీ ఓపెన్ కాస్ట్ గని, భూపాలపల్లి కేటీకే ఓసీ-3 గని (సామర్థ్యం పెంపుదల), జీడీకే ఓపెన్ కాస్ట్ గనుల నుంచి నిర్దేశించిన ఉత్పత్తిని తప్పక సాధించాలని కోరారు. వచ్చే ఏడాది సింగరేణి 750 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించుట కోసం కొత్త ఓపెన్ కాస్టు గనులు సకాలంలో ప్రారంభమవడం అత్యంత అవసరంమన్నారు. దీని కోసం 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డైరెక్టర్ల పర్యవేక్షణలో ఏరియా జనరల్ మేనేజర్లతో పాటు వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకుంటూ ముందుకు పోవాలని సూచించారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల పై సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఉత్పత్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ల నుండి రైలు ,రోడ్డుమార్గం ద్వారా బొగ్గు రవాణా నిర్దేశిత లక్ష్యాల మేరకు సాగాలని కోరారు. నిర్మాణంలో ఉన్నకొత్త సీహెచ్పీల పనులను పర్యవేక్షిస్తూ త్వరలో ఇవి కూడా ప్రారంభించాలని ఆదేశించారు.అనంతరం ఆయన సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనులు పేలుడు పదార్థాల సరఫరా పై సంబంధిత కంపెనీలతో సమీక్ష నిర్వ హించారు . సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఇప్పుడు గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో పేలుడు పదార్థాల సరఫరాలో ఎటువంటి జాప్యం, అంతరాయం ఉండకూడదని, సకాలంలో రవాణా జరపాలని సూచించారు.
సమావేశంలో సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ,పా ) బలరాం, డైరెక్టర్ (ఇఅండ్ఎం) సత్యనారాయణ రావు ,అడ్వైజర్లు ఎన్. ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్ ) జె.ఆల్విన్ , జనరల్ మేనేజర్( కో ఆర్డినేషన్ ) కె. సూర్యనారాయణ, జీఎం (సిపిపి) నాగభూషణ్‌రెడ్డి , జీఎం (ప్రాజెక్టు & ప్లానింగ్ ) సత్తయ్య , జనరల్మేనేజర్( స్ట్రాటజిక్ ప్లానింగ్) సురేందర్, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.