కార్మికులు కర్రు కాల్చివాత పెడతారు
-టీబీజీకేఎస్ వచ్చాకే కార్మికుల హక్కుల సాధన
-ఉన్నవి పోగొట్టింది జాతీయ కార్మిక సంఘాలు
-సమైక్యపాలకుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు
-ధ్వజమెత్తిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ నేతలు

TBGKS leaders flagged down national trade unions: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వచ్చాకే కార్మికుల హక్కులు సాధించుకున్నామని ఆ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం Rk-7 గనిలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పెట్టం లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ కార్మికులకు మెరుగైన వేజ్ బోర్డు సాధించడంలో జాతీయ కార్మిక సంఘాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
జాతీయ కార్మిక సంఘాలు ఉన్న హక్కులు పొగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోరాడి సాధించుకున్న డిపెండెంట్ ఉద్యోగ హక్కును అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సింగరేణిలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ ప్రోత్సహించారని అన్నారు. సర్పేస్ డిపార్ట్మెంట్లను కాంట్రాక్టీకరణ చేయించి ప్రైవేటు కార్మికుల సంఖ్య పెంచిన ఘనత మీదేనని అన్నారు. గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం తీసుకువస్తే గొర్రెలలాగా తల ఊపి 20 వేల మంది కార్మికులను బజారు పాలు చేసి వారి ఉసురు పోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు కార్మికుల పక్షపాతి ఐతే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాన్ని ఎందుకు వ్యతిరే్కించలేదని వారు ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల మీద ప్రేమతో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కారుణ్య నియామకాల ద్వారా జాతీయ సంఘాల నాయకులు, కార్మికులు అన్ఫిట్ అయి కొడుకులకు ఉద్యోగాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు. ఇంటి రుణం రూ. 10 లక్షలకు వడ్డీ యాజమాన్యం చెల్లించే విధంగ స్వయంగా కేసీఆర్ ప్రకటించడం ద్వారా కార్మికులు వడ్డీ పొందుతున్నారని స్పష్టం చేశారు.
మీరు వేజ్ బోర్డు లో 1% కరెంట్ బిల్లుల కోతను తీసుకొస్తే కేసీఆర్ సింగరేణి కార్మికులకు కరెంట్ బిల్లులు రద్దు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుని తల్లి దండ్రులకు కార్పొరేట్ వైద్యం, పెండింగ్‌లో ఉన్న 3500 మందికి వెంటనే ఉద్యోగాల కల్పన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యాయని స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ ఏం సాధించలేదని అంటున్నారని మేమేం చేశామో కార్మికులే చెబుతారని వెల్లడించారు. కేసీఆర్ ను, టీబీజీకేఎస్‌ను విమర్శిస్తే కార్మికులు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తారనుకోవడం మీ భ్రమ అని మళ్లీ కార్మికులే కర్రు కాల్చి వాత పెట్టే రోజులు మళ్ళీ వస్తాయన్నారు.
సమావేశంలో జీఎం చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి, ఏరియా సెక్రటరీ అశోక్, నాయకులు లేగల శ్రీనివాస్, తొంగల రమేష్, చిలువేరు సదానందం, జీఎం కమిటీ ఆల్టర్నేట్ కమిటీ మెంబర్ బుస రమేష్, పిట్ సెక్రటరీ మెండ వెంకటి, ప్రేమ్ కుమార్, రాజు నాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.