రాజన్న సన్నిధిలో భక్తుడి మృతి
-ఈవో కార్యాలయం ఎదుట కామారెడ్డి వాసి మృత్యువాత
-ఆలయ ప్రాంగణంలో మూసి ఉన్న వైద్యశాల
-అందుబాటులో లేని వైద్య సిబ్బంది
-సకాలంలో రాని 108 అంబులెన్స్

Vemulawada temple: వేములవాడ రాజన్న సన్నిధిలో ఓ భక్తుడు మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో అతను చనిపోయినట్లు పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో సోమవారం ఉదయం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈవో కార్యాలయం ముందు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దేవాలయ ప్రాంగణంలోని వైద్యశాల మూసివేసి ఉండడంతో పాటు 30 నిమిషాలైనా వైద్య సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు.
ఇక కొందరు భక్తులు, సాయిలు కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అయినా సకాలంలో అంబులెన్స్ రాలేదు. ఆలయ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులే వ్యక్తికి ప్రథమ చికిత్స చేశారు. దీంతో ఆ వ్యక్తికి వైద్యం అందక అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సాయిలు మరణించడంతో, మృతదేహాన్ని కారులో వారి స్వగృహానికి తీసుకువెళ్లారు.