ఏజెన్సీ పోలీసు ఉద్యోగాల‌ను స్థానికుల‌తోనే భ‌ర్తీ చేయండి

-ఆసిఫాబాద్ ప్రాంత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి
-నూతన DGPని కలిసిన ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు

Asifabad: ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేలా చొర‌వ చూపాల‌ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను కోరారు. నూత‌న డీజీపీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌ను సోమ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా DGPతో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి గిరిజన బెటాలియన్ లో పని చేస్తున్న పూర్వ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజన పోలీస్ ఉద్యోగులను వారి సొంతజిల్లాకు బదిలీ చేయాలన్నారు. గిరిజన బెటాలియన్ లో పనిచేస్తున్న వారికి కూడ విద్యార్హత, సీనియారిటీ బట్టి ప్రమోషన్లు కల్పించాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంత పోలీస్ ఉద్యోగాలను స్థానిక ఆదివాసీ అభ్యర్ధులతో భర్తీ చేయాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకులకు పోలీస్ శాఖ ద్వారా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని డీజీపీని కోరారు. నూతన మండలమైన‌ గాదిగూడకు పోలీస్ స్టేషన్ భవనం మంజూరు చేయాలన్నారు. తాను చెప్పిన స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న DGP సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించార‌ని ఎమ్మెల్యే ఆత్రం స‌క్కు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like