యువతిని తండ్రికి అప్పగించిన సఖి సిబ్బంది
Manchiryal: మతి స్థిమితం లేని యువతిని మంచిర్యాల సఖి సిబ్బంది ఆమె తండ్రికి అప్పగించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు దేవంపూర్ కు చెందిన దేవసాని శ్రీనివాస్ కుమార్తె శ్రీజను మతిస్థిమితం లేని కారణంగా చంద్రపూర్ లోని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బయల్దేరారు. మానకొండూరు నుంచి మంచిర్యాల కి వచ్చారు. బస్టాండ్ సమీపంలో శ్రీనివాస్ పండ్లు కొనే సమయంలో శ్రీజ అక్కడి నుండి బస్సు ఎక్కి చున్నం బట్టి ప్రాంతంలో దిగింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఆ అమ్మాయిని సఖి కేంద్రానికి తీసుకు వచ్చారు. అమ్మాయి దగ్గర నుండి వివరాలు తెలుసుకున్న సఖి సిబ్బంది ఆమె తండ్రి శ్రీనివాస్ కు ఫోన్ చేశారు. సఖి కేంద్రానికి వచ్చిన శ్రీనివాస్ కూతురును తీసుకువెళ్లాడు. తన కూతురిని తనకు అప్పగించినందుకు సఖి సిబ్బందికి శ్రీనివాస్ ధన్యవాదాలు చెప్పారు.