భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సందర్శించిన సీపీ రెమా రాజేశ్వరి
Manchiryal: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తాండూరు మండలంలో కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి సూచించారు. ఆమె శుక్రవారం బుగ్గను సందర్శించారు. శనివారం నిర్వహించనున్న జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రాంనాథ్, బెల్లంపల్లి ఏసీపీ పి.సదయ్య, బెల్లంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్ తో చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అంవాఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని కోరారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, జాతర సమయం లో ట్రాఫిక్ సమస్య రాకుండా పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. జాతరకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దేవుడి దర్శనం చేసుకుని వారు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ,పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి, ఆలయ కమిటీ సభ్యుడు అభినవ సంతోష్ కుమార్, తాళ్ళగురిజాల ఎస్ఐ రాజశేఖర్,బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.