పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి

మంచిర్యాల// రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతుందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు వ్యాట్ తగ్గించి ఆ రాష్ట్ర ప్రజలకు పన్ను భారం తగ్గించాయన్నారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి పన్నులు తగ్గించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు గోనె శ్యామ్ సుందర్ రావు, పోనిగోటి రంగరావు, పెద్దపల్లి పురుషోత్తం, రజినిష్ జైన్, అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేష్, ఆరుముల్ల పొశం, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, పట్టి వెంకట కృష్ణ, బొద్దున మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.