రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
-రోజూ 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి
-జీఎంలకు సింగరేణి సీఅండ్ఎండీ ఎన్. శ్రీధర్ దిశా నిర్దేశం
Singareni: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని సింగరేణి సంస్థ సీఅండ్ ఎండీ శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో ఆయన గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలు వేసవి నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచుతున్నాయన్నారు. దీనికి అనుగుణంగా బొగ్గు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు. అందుకే సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలు నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు రోజువారీగా సాధించాలని ఆదేశించారు. ఇకపై రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని తప్పనిసరిగా సాధించాలన్నారు. అదే పరిమాణంలో బొగ్గు రవాణా చేయాలని ఆదేశించారు. ఉత్పత్తి పెరగాలంటే ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా లక్ష్యాల మేర సాధించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇకపై రోజుకు కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు.
మార్చి నెల నుంచి వరుసగా నాలుగు నెలల పాటు ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు గట్టి పునాది ఏర్పడుతుందని శ్రీధర్ వెల్లడించారు. వివిధ ఏరియాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస పనులు మరింత వేగవంతం చేయాలని కోరారు. ఆయా ఏరియాల అధికారులు జిల్లా కలెక్టర్లు, అటవీశాఖతో సంప్రదిస్తూ పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ రావు, ఎన్.వి.కె.శ్రీనివాస్ (ఆపరేషన్స్),జి. వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎం (కోఆర్డినేషన్)సురేశ్, జి.ఎం.(సీపీపీ) సి.హెచ్.నరసింహారావు, జి.ఎం. (మార్కెటింగ్ )సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.