దొంగల ముఠా బ్యాచ్ అధ్యక్షుడు రేవంత్
-కాంగ్రెస్ పార్టీ అవినీతి పేటెంట్
-దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది
-కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేక కవితపై దాడులు
-ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్
Balka Suman: రేవంత్రెడ్డి దొంగల ముఠా బ్యాచ్ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. మంగళవారం చెన్నూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ అయితే, బ్లాక్ మెయిల్ పేటెంట్ రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు.
2004లో సోనియా గాంధీ కరీంనగర్ లో తెలంగాణపై మాట మార్చిన విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని బాల్క సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2004 నుంచి 2016 వరకు వెయ్యి మందికి పైగా ఆమరులవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీ A to Z స్కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు రైతుభీమా లాంటి ఒక్క పథకం అమలు చేయడం లేదన్నారు. ఎవరి వెనుక ఎవరున్నారో తెలంగాణ ప్రజలు గమనించాలని సుమన్ కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక మా పార్టీ నాయకులను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో భయపెట్టాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. మోడీ తాటాకు చప్పుల్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఉద్యమ సమయంలో వందల కేసులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులదని బాల్క సుమన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, అదాని.. ప్రధాని బినామీగా కొనసాగుతున్నడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎదుర్కునే దమ్ము లేక కవితపై ఈడి దాడులు చేయిస్తున్నారని అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని సుమన్ సవాల్ విసిరారు. రాష్ట్ర రాజధానిలో సచివాలయం, అమరవీరుల స్మారక సౌధం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టడం కాంగ్రెస్, బిజెపిలకు మింగుడు పడటం లేదని అన్నారు. తెలంగాణకి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బాల్క సుమన్ వెల్లడించారు.