మేం కన్నెర్ర చేస్తే భస్మమే…
బీజేపీ అంటే ఏంటో చూపిస్తాం - కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ వార్నింగ్

హైదరాబాద్ – తాము కన్నెర్ర చేస్తే భస్మమేనని, బీజేపీ అంటే ఏమిటో చూపిస్తామని కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా తనను వెధవ అని సీఎం వ్యాఖ్యలపై అదే స్థాయిలో మండి పడ్డారు. తీన్మార్ మల్లన్న ఎవడో లొట్టపీసుగాడు అన్న విషయంలో అతనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని తాను చెబితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నే లొట్టపీసు అన్నట్లుగా కేసీఆర్ వక్రీకరించారని అది సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బలోపేతం చేసిందే బీజేపీ అని స్పష్టం చేశారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకపోతే మెడ కోసుకుంటానన్న కేసీఆర్ ఇప్పుడు తమ నాలుకలు కోస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల గురించి గొప్పగా చెప్పే కేసీఆర్ సొంత జిల్లాలోనే ఏడేండ్లలో 417 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందూరులో కవితకు పట్టిన గతికి పదింతలు కేసీఆర్‌కు పట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీజేపీ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు.