‘నా ఫోన్ పోయింది… వెతికిపెట్టండి..
పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు
Bandi Sanjay : తన ఫోన్ పోయిందని దానిని వెతికిపెట్టాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో 7680006600 నంబర్ ఉన్న ఫోన్ మిస్ అయ్యిందని బండి కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు.. ఫోన్లో కీలక సమాచారం ఉందని అంటున్న పోలీసులు.. తమ దగ్గర బండి సంజయ్ ఫోన్ లేదని చెబుతున్నారు. ఇప్పటివరకు ఆయన మొబైల్ పై జరుగుతున్న ప్రచారం మరో మలుపు తిరిగినట్టు అయింది.
ఆ ఫోన్ నిజానికి తన సోదరి డాక్టర్ సౌమ్య పేరుపై ఉందని.. భద్రత కారణాల వల్ల తాను ఇతరుల పేరుపై నెంబర్లు వాడాల్సి వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కాంటాక్ట్స్ పోయాయని.. ఇప్పటికే ఫోన్ కి సంబంధించి పోలీసులు వెతుకుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని కాబట్టి స్పందించి వెంటనే తన ఫోన్ తనకు వచ్చేలా చేయాలని పోలీసులను కోరారు. ఈనెల 4వ తారీఖున అర్ధరాత్రి రాత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదటగా ముందస్తు అరెస్ట అని పేర్కొన్న పోలీసులు తర్వాత 10వ తరగతి హిందీ పేపర్ వైరల్ చేసినందుకు బండిసంజయ్ అరెస్ట్ చేసినట్లు చెప్పారు.