సింగరేణికి మరిన్ని బొగ్గు బ్లాక్లు కేటాయించాలి
INTUC సెక్రటరీ జనరల్ డా. శ్రీ జనక్ ప్రసాద్
INTUC:సింగరేణికి తాడిచర్ల–II బొగ్గు బ్లాక్ కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని INTUC సెక్రటరీ జనరల్ డా.జనక్ ప్రసాద్ తెలిపారు. తాడిచర్ల–II బొగ్గుబ్లాక్ కేటాయింపునకు సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి సంస్థ దీర్ఘకాలిక అభివృద్ధి, కార్మికుల ఉద్యోగ భద్రత, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతి దృష్టిలో ఉంచుకుని INTUC తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని తెలిపారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల–II బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం సంతోషకరమైన విషయమన్నారు.
తాడిచర్ల–II బొగ్గుబ్లాక్ ద్వారా 40 నుంచి 50 సంవత్సరాల వరకు సింగరేణి సంస్థకు అవసరమైన బొగ్గునిల్వలు అందుబాటులో ఉండి, సంస్థ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. వేలం లేకుండా బొగ్గు బ్లాక్ కేటాయించడం ద్వారా సింగరేణి సంస్థకు సుమారు రూ.2,550 కోట్ల ప్రీమియం భారం ఆదా కానుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీలు, పన్నులు ఇతర ఆదాయాల రూపంలో సంవత్సరానికి సుమారు రూ.16,000 కోట్ల వరకు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,200 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు.
పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణికి కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3తో పాటు గోదావరి వ్యాలీలోని ఇతర బొగ్గు బ్లాకులను కూడా కేటాయించాలని INTUC పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కీలక నిర్ణయానికి సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కార్మికులు INTUC పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో INTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.డి.చంద్రశేఖర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమయ్య, జెట్టి శంకర్ రావు పాల్గొన్నారు.