సింగరేణిలో ఇకపై ‘మజ్దూర్’ కాదు.. ‘అసిస్టెంట్’
Singareni:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగుల హోదాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తొమ్మిది డిజిగ్నేషన్లలో ఉన్న “మజ్దూర్” పదానికి బదులుగా “అసిస్టెంట్” అనే పదాన్ని ఉపయోగించాలని యాజమాన్యం నిర్ణయించింది. గురువారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సీఎండీ స్థాయిలో నిర్వహించిన 38వ, 39వ నిర్మాణాత్మక సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే సంస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్న జనరల్ మజ్దూర్ హోదాను జనరల్ అసిస్టెంట్‌గా మార్చుతూ ఏడాది క్రితమే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరో తొమ్మిది డిజిగ్నేషన్లలో కూడా అదే విధానాన్ని అమలు చేసింది. ఉద్యోగుల హోదాలకు మరింత గౌరవప్రదమైన గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపట్టినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో పాటు, ఉద్యోగుల సంక్షేమం, గౌరవం, అభ్యున్నతికి సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొంది.