కథ అయిపోలేదు..
-ఆరిజన్ డైరీ వ్యవహారంలో షెజల్ కీలక వ్యాఖ్యలు
-తన వద్ద ఉన్న అసలు ఆధారాలు బయటపెడతానని హెచ్చరిక
-అవి ఏమిటనే వాటిపై పెద్ద ఎత్తున చర్చ
MLA Durgam Chinnayya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేస్తున్న ఆరిజన్ డైరీ డైరెక్టర్ షెజల్ అలియాస్ శైలజ తాజాగా మరో బాంబు పేల్చారు. తన వద్ద మరిన్ని అధారాలు, ఫొటోలు ఉన్నాయని వాటిని విడతల వారిగా విడుదల చేస్తానని స్పష్టం చేశారు.
ఆరిజన్ డైరీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేసిన ఆ సంస్థ డైరెక్టర్ షెజల్ ఆదివారం మరో వీడియో విడుదల చేసింది. అందులో అటు ఎమ్మెల్యే ఆయన అనుచరులపై ఆరోపణలు గుప్పించింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. మొదట కొంత వాట్సప్ చాట్, అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసిన ఆమె తాజాగా వీడియోలు విడుదల చేసింది. ఇక త్వరలో అసలు సిసలు ఆధారాలు బయటపెడతానంటూ స్పష్టం చేసింది.
ఆమె ఆరోపణల నేపథ్యంలో అసలు ఆమె వద్ద ఉన్న ఫొటోలు ఏంటి…? ఎలాంటి ఆధారాలు బయటపెట్టబోతోంది అనేది సంచలనంగా మారింది. వాస్తవానికి ఇలాంటి చర్చ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఆరిజన్ డైరీ నిర్వాహకులు సైతం చాలా తెలివిగా ఈ వ్యవహారం నిత్యం చర్చల్లో ఉండేలా చూస్తున్నారు. రోజుకో వీడియో బయటకు వదలడం ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం చేస్తున్నారు. దీంతో నిత్యం ఇదే విషయమై చర్చ సాగుతోంది. అయితే, ఆరిజన్ డైరీ నిర్వాహకులు కావాలనే తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని దుర్గం చిన్నయ్య ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుండా చేసేందుకు ప్రత్యర్ధులు ఆడిస్తోన్న గేమ్ అంటూ దుర్గం చిన్నయ్య కొట్టిపారేశారు.
దీంతో, షెజల్ తాజాగా తన వద్ద ఉన్న అసలు ఆధారాలు బయటపెడతానని వెల్లడించడం మరోమారు సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజన్ డైరీ వ్యవహారం ఇప్పుడు అప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తమను అరెస్టు చేయించిన చిన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆరిజన్ డైరీ నిర్వాహకులు కంకణం కట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది. మరి వారు ఆధారాలు ఎప్పుడు బయటపెడతారు….? అవి ఏమిటి..? అనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజంగానే వారి వద్ద అసలైన ఆధారాలు ఉంటే ఇప్పటి వరకు బయట పెట్టేవారు కదా…? అనే వారు కూడా ఉన్నారు. మరి ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.