మూడు బిల్లులకు గవర్నర్ తమిళ్ సై ఆమోదం
సుప్రీం కోర్టులో విచారణకు ముందు కీలక నిర్ణయం..!!
Governor Tamil Sye: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను తిప్పిపంపగా.. మరో రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలినకు పంపించారు. కేవలం రెండు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. పరిశీలన తర్వాత వాటిపై గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2022 సెప్టెంబర్ 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో ప్రభుత్వం పది బిల్లులు ప్రభుత్వం గవర్నర్ పరిశీలనకు పంపింది. ఆమె అప్పటి నుంచి తన వద్దే పెండింగ్ లో ఉంచారు. దీంతో గవర్నర్ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని.. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టు ఆశ్రయించామంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది.