చేతికి చెయ్యిచ్చి.. కమలం గూటికి..
-కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
-పార్టీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా
-బీజేపీలో చేరేందుకు రెడీ
Alleti Maheshwar Reddy: అనుకున్నంతా అయ్యింది.. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పై అంసతృప్తితో ఉన్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వ్రెడ్డి పార్టీ వీడారు. గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు మహేశ్వర్ రెడ్డి. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి తరుణ్ చుగ్ తో సమావేశం తర్వాత.. ఢిల్లీలో ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆయనకు బీజేపీ కండువా కప్పిన నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. తనకు పీసీసీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పిన ఏలేటీ బీజేపీ నేతలతో భేటీ అయ్యి రాజీనామా చేశారు. రెండు రోజుల కిందట నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులు, నేతలతో మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యి.. భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గంటలోగా వాటికి జవాబు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు పంపించారు. పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఏఐసీసీ లీడర్ అయిన తనకు పీసీసీ నోటీసులు ఇవ్వడం ఏంటని ఫైరయ్యారు. 13 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉంటున్న తాను.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదని, నడుచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ లోని కొందరు నాయకులు బీజేపీ అగ్రనాయకులతో కలిసినా వారికి ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా.. తనకు మాత్రమే ఇస్తారా..? అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఏలేటీ మహేశ్వర్రెడ్డి కాంగ్రెస్ వీడిని బీజేపీలో కలవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.