‘పాలమ్మిన.. పూలమ్మిన’… ఈసారి అన్నది కేటీఆర్
మంత్రి మల్లారెడ్డి డైలాగ్ చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి
MallaRedyy-KTR: పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా.. ఈ స్థాయిలో ఉన్న.. ఈ మాట వినగానే చిన్నపిల్లలు సైతం చెప్పేస్తారు అన్నది ఎవరని.. అంత పాపులర్ అయ్యారు ఈ డైలాగ్తో మంత్రి మల్లారెడ్డి. దీనిపై సోషల్మీడియాలో మీమ్స్, రీల్స్ వీడియోలు ఎన్నో వచ్చాయి. అయితే, ఈ డైలాగ్ మరోసారి నేత నోటి నుంచి వచ్చింది. కానీ అన్నది మాత్రం మంత్రి మల్లారెడ్డి కాదు. ఈసారి అన్నది మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో కలుషిత జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్లాంట్ ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మరో మంత్రి మల్లారెడ్డిని చూస్తూ ఆయన డైలాగ్ చెప్పి సభలో ఉన్నవారి అందరినీ నవ్వించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జులై నాటికి వందశాతం STPలున్న నగరంగా హైదరాబాద్ మారనుందని ధీమా వ్యక్తం చేశారు. 4 వేల కోట్లు ఖర్చుచేసి వ్యర్థరహిత భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 250 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన జవహర్ నగర్ కలుషిత వ్యర్ధజలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్ ని మంత్రి KTR ప్రారంభించారు. ప్లాంట్ అందుబాటులోకి రావడం వల్ల డంపింగ్ యార్డు నుంచి వచ్చే కలుషిత వ్యర్ధ జలాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. కొత్త ప్లాంట్ వల్ల భవిష్యత్ లో జవహర్ నగర్ తోపాటు…. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నీటికాలుష్య సమస్య తలెత్తబోదని హామీ ఇచ్చారు. మల్కారం చెరువు కాలుష్య కాసారం నుంచి బయటపడడమే కాక సమీపంలో భూగర్భజలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు