భట్టి నడక ప్రేంసాగర్ రావు చేతిలో…
-పాదయాత్ర ప్రభావం అంతంతే
-ఎమ్మెల్యేలు ఇద్దరిపై ఎందుకు మాట్లాడలేదు..?
-కేవలం దివాకర్‌రావు పైనే మాటల దాడి ఎందుకు..?
-జనాన్ని తరలించడంలో నేతల వైఫల్యం
-రూట్ మ్యాప్ ఇష్టం వచ్చినట్లు మార్చారు
-ప్రజలను కలవడంలోనూ ఆసక్తి చూపలేదు
-సీఎల్పీ నేత పాదయాత్రపై సునీల్ కనుగోలు సర్వే
-ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక
-ఏఐసీసీకి పూర్తి స్థాయి వివరాలు అందించిన సునీల్
-మంచిర్యాల పాదయాత్రపై భట్టి సైతం అంతర్మథనం
CLP leader Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర వల్ల పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదు.. దాని వల్ల ఆశించిన దానికంటే వ్యతిరేకతే ఎక్కువగా జరిగింది. ఆయన పాదయాత్ర కేవలం ఒక నాయకుడి చెప్పినట్లు ఇష్టం వచ్చినట్లు కొనసాగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర అటు నాయకులు, ఇటు ప్రజల్లో అసంతృప్తి మిగిల్చింది. ఇదంతా కాంగ్రెస్ పాదయాత్రపై ఇతర పార్టీల వారో, ప్రత్యర్థులో చేస్తున్న ఆరోపణలు కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు అధిష్టానానికి అందించిన నివేదిక.
ప్రజలకు దగ్గరయ్యేందుకు, కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించడంతో పాటు నేతల్లో ఉన్న అనైకత్య దూరం చేసి అందరిని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజార్‌హత్నూరు మండలం పిప్రిలో పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈ యాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 31 రోజుల పాటు సాగింది. జై భారత్ సత్యాగ్రహ దీక్ష పేరుతో బహిరంగ సభ సైతం నిర్వహించారు. ఇలా పాదయాత్ర పైకి చూడటానికి బాగానే నడిచినా లోలోపల మాత్రం ఎన్నో ఆటుపోట్లకు కారణమైంది. నేతల మధ్య పొరపొచ్చాలు బయటకు కనిపించాయి. జనం స్పందన విషయంలో సైతం పెద్దగా లేదు. ఇక అసలుది.. అన్నింటికంటే ముఖ్యమైంది మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు వన్‌మాన్ షో చేసి భట్టి విక్రమార్క పాదయాత్ర రూట్ మ్యాప్ తనకు నచ్చినట్లుగా మార్చారని.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రపై ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే చేయించారు. దాదాపు నాలుగు బృందాలు ఈ పాదయాత్రపై అధిష్టానికి ఎప్పటికప్పుడు నివేదిక అందించారు. ఏ రోజు ఎవరెవరు హాజరు అయ్యారు..? ఒకవేళ నేతలు హాజరు కాకపోతే ఎందుకు హాజరు కాలేదు..? ఎంతమందిని తరలించారు. సీనియర్లు, జూనియర్లను సమన్యాయంతో కలుపుపోతున్నారా..? లేదా అనే అంశంపై ఈ సర్వే సాగింది. అదే సమయంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది. భట్టి విక్రమార్క ప్రజలతో ఏం మాట్లాడారు..? ఎంత మందిని కలిశారు…? ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరుస్తూ ఈ నివేదిక తయారు చేశారు. ప్రతి రోజు ఈ సర్వేకు సంబంధించి క్రోడకరించి అటు పీసీసీకి ఇటు ఏఐసీసీకి సమర్పించినట్లు తెలుస్తోంది.
ఇందులో ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించిన పాదయాత్ర విషయంలో నివేదిక అందించారు. మంచిర్యాల పాదయాత్ర పూర్తిగా పీఎస్ఆర్ చేతిలోకి వెళ్లిందని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నారని రూట్‌మ్యాప్ ఎప్పటికప్పుడు మార్చడం వల్ల అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో గందరగోళం కొనసాగిందని వెల్లడించారు. వాస్తవానికి రూట్ మ్యాప్ బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సాగాలి. కానీ, ఎక్కడా కూడా ఎక్కువ గ్రామాలు తగలకుండా రూట్ మ్యాప్ రూపొందించారని సర్వేలో పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అటు మందమర్రికి వెళ్లకుండా, ఇటు చెన్నూరుకు పోకుండా మధ్యలో అడవుల గుండా రూట్ మ్యాప్ మళ్లించారు. ప్రతి రోజు రూట్ మ్యాప్ మార్చారు. ఒకరకంగా భట్టి పాదయత్ర గందళగోళంగా నడిచింది. దీనినే అధిష్టానికి నివేదించారు.
పాదయాత్ర సమయంలోనే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్నయ్యపై ఆరిజన్ వ్యవహారంలో పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అమ్మాయిలను తెమ్మన్నాడని, తమ వద్ద డబ్బులు తీసుకున్నాడని ఇలా రాష్ట్ర వ్యాప్త చర్చ సాగింది. ఆ విషయంలో ఎక్కడా కూడా భట్టి మాట్లాడలేదు. ఈ వ్యవహారంలో ఆయన మాట్లాడి ఉంటే, స్పందిస్తే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేదని అది పార్టీకి మైలేజీ అయ్యేదని సర్వేలో పేర్కొన్నారు. ఇక చెన్నూరు నియోజకవర్గంలో తిరిగిన సమయంలో కూడా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కనీసం స్పందించలేదు. ప్రేంసాగర్ రావుకు వీరిద్దరితో ఉన్న అంతర్గత సంబధాలతోనే భట్టిని మాట్లాడించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తనకు ప్రధాన శత్రువు, మంచిర్యాలలో ప్రత్యర్థి, ఎమ్మెల్యే దివాకర్ రావుపై భట్టితో మాటల దాడి చేయించారు. ఇది కూడా సర్వేలో ప్రధానంశంగా మారింది.
జనాల తరలింపు విషయంలో సైతం నేతలు వైఫల్యం చెందినట్లు సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు సరిగ్గా హాజరు కాలేదు, నెన్నల మండలం ఆవడం, గంగారం మధ్యలో క్యాంపు ఏర్పాటు చేసిన భట్టి తన పాదయాత్ర ఆపేస్తానన్న హెచ్చరించారు. కార్యకర్తలు సరిగ్గా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రేంసాగర్ రావు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ఆశిస్తున్న ఐదుగురు అభ్యర్థులను పిలిచి సీరియస్ అయ్యారు. వెంటనే అందులో ఓ అభ్యర్థి నేను నిన్ను టిక్కెట్టు అడగలేదు. మీరే స్టేజీపై అనౌన్స్ చేశారు. నాకు ఉన్న పదవి చాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతులు నష్టపోయారు. భట్టి వస్తారని వారంతా ఎదురుచూశారు. కానీ భట్టి అటు వైపు వెళ్లలేదు. కేవలం ప్రేంసాగర్ రావు వల్లే భట్టి పాదయాత్ర అటు వైపు వెళ్లకుండా రూట్ మ్యాప్ మారిందని నివేదికలో పొందుపరిచారు.
చివరగా జై భారత్ సత్యాగ్రహ సభలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు వ్యవహరించిన తీరుపై సైతం ఆరా తీశారు. రేవంత్‌రెడ్డిని ఆయన పలకరించకపోవడం, స్టేజీపైన రేవంత్ రెడ్డి మాట్లాడకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయడం లాంటి అంశాలు సైతం ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో పీఎస్ఆర్ మధ్యలో అలిగివెళ్లడం, ఉత్తమ్ చేయి పట్టి ఆపడం, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెనక్కి తీసుకురావడం ఇలా అన్ని అంశాలతో కూడిన నివేదిక సిద్దం చేసిన సునీల్ కనుగోలు అధిష్టానికి అందించారు.