తెలంగాణ సచివాలయానికి గోల్డ్ రేటింగ్

Telangana Secretariat: చారిత్రాత్మక నిర్మాణ శైలితో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయం మరో ఘనత సొంతం చేసుకుంది. నూతన సచివాలయానికి గోల్డ్ రేటింగ్ దక్కింది. హరిత ప్రమాణాలతో నిర్మించిన భవనాలకు ఈ రేటింగ్ దక్కుతుంది. ఆ భవనాల్లోకి గాలి, వెలుతురు పుష్కలంగా రావాలి. నీటి వృథా నియంత్రించేందుకు సెన్సర్స్, ఆటోమేటిక్ విద్యుత్తు పరికరాలు వినియోగించాలి. ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్లాటినం, గోల్డ్, సిల్వర్ గుర్తింపు ఇస్తారు. ఇలాంటి భవనాలు నిర్మించినట్లు ఆయా సంస్థలు ఐజీబీసీకి దరఖాస్తు చేసుకుంటాయి.
అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్ ఉంటుంది. నిపుణుల బృందం ఆ నిర్మాణాన్ని పరిశీలించి, రేటింగ్ జారీ చేస్తుంది. తెలంగాణ సచివాలయం హరిత ప్రమాణాలతో నిర్మించారని హరిత భవన మండలి హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తెలిపారు. విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందన్నారు. ఆ రేటింగ్ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో ఇంకోటి లేదు.
సచివాలయంలో వంద శాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భవనంలోని వారికి బయటి పరిసరాలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు వినియోగాన్ని పర్యవేక్షించేందుకు భవన నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పచ్చదనం కోసం మొక్కలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ కోర్డుయార్డు నమూనా కూడా వినియోగించారు. ఐజీబీసీ ప్రమాణాల మేర పరికరాలు ఉపయోగించటంతో రేడియేషన్ తక్కువ ఉండటంతో ఆ భవనంలో పని చేసే వారిలో ఉత్పాదకత పెరుగుతుందని శాస్త్రీయంగా గుర్తించినట్లు ఆయన వివరించారు.