బ్రేకింగ్.. నీటి గుంతలో పడి మరో బాలుడి మృతి
Hyderabad: ఇటీవలే కురిసిన వర్షానికి హైదరాబాద్ కళాసిగూడలో ఓ చిన్నారి నాలాలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరో విషాద ఘటన జరిగింది. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ప్రమాదవశాత్తు నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగించడంతో బాలుడి మృతదేహం లభించింది. ఒక భవనం దగ్గర గుంతను తవ్వి వదిలేశారు. అందులో వర్షపు నీళ్లు నిలవడంతో బాలుడు ఆడుకుంటుండగా అందులో పడి మరణించాడు. పక్కనే ఉన్న షోరూమ్‌లో బాలుడి తండ్రి వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. బతుకుదెరువు నిమిత్తం ఈ మధ్యే ఏపీ నుంచి బాలుడి కుటుంబం వచ్చినట్లు తెలుస్తోంది. వివేక్ మృతితో అతని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విషాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
కొద్ది రోజుల కిందట హైదరాబాద్ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి నాలాలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జీహెచ్ఎంసీ సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది. బేగంపేట డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎగ్జక్యూటివ్ ఇంజినీర్ ఇందిరా భాయ్‌కు ఆదేశాలు జారీచేసింది. పది రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఇంత జరిగినా అధికారుల తీరులో మార్పు రావడం లేదు.
మౌనిక మృతి మరవకముందే ఆరేళ్ల బాలుడు మృత్యువాత పడటంతో ప్రజలు వణికిపోతున్నారు. మరలా ఈ ఘటన చోటుచేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఎక్కడా అడుగువేస్తే గుంతలో పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుసినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.