తిరుమలలో భద్రత డొల్ల..
-శ్రీవారి ఆలయంలోకి మొబైల్ తీసుకెళ్లిన వ్యక్తి
-ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు
-భద్రతపై మండిపడుతున్న భక్తులు
Tirumala : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పటిష్టమైన భద్రత ఉన్నా ఓ భక్తుడు శ్రీవారి గర్భగుడి వరకు మొబైల్ తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనతో శ్రీవారి ఆలయం భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఓ భక్తుడు శ్రీవారి ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. గర్భగుడిని అత్యంత సమీపం నుంచి ఫోటోలు, వీడియోలు తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో భక్తులు టీటీడీ అధికారులపై మండిపడుతున్నారు.
శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. పలు దశల్లో భక్తుల్ని తనిఖీలు చేసి లోపలికి పంపిస్తారు. ఓ భక్తుడు ఇవన్నీ దాటుకుని సెల్ ఫోన్ పట్టుకు వెళ్లాడు అంటే అది కచ్చితంగా భద్రతా వైఫల్యమే అంటున్నారు భక్తులు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సెల్ఫోన్ తీసుకువెళ్లడమే కాకుండా అక్కడ ఫోటోలు, వీడియోలు తీస్తున్నా సెక్యురిటీ సిబ్బంది పట్టించుకోలేదంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
ఇటీవల తిరుమల కొండకు టెర్రరిస్టుల ముప్పు ఉందని హెచ్చరికలు వచ్చాయి. దాంతో పాటు తిరుమల కొండపై విమానాలు చక్కర్లు కొట్టాయి. ఇలా నిత్యం ఏదో ఒకచోట అపచారం జరుగుతుండడంతో భక్తులు అధికారులు మండిపడుతున్నారు. నెల రోజుల కిందట శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఒరిజనల్ ఫోటోలు ఫేస్ బుక్లో ప్రత్యక్షం అయ్యాయి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి కటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడి ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో చైర్మన్ అనుచరులు ఏకంగా మూలవిరాట్ ఫోటోలను తీశారు. ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.