గుడ్డి గుర్రం పండ్లు తోమిండ్లా..
-55 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసింది..?
-రాత్రిపూట కరంటు ఇచ్చి రైతుల ఉసురు తీసిండ్రు
-చాలా చేశాం.. చేయాల్సినవి ఇంకా ఉన్నాయి
-ఎన్నికలు వస్తే చాలా మంది వస్తారు
-ప్రజల కోసం పనిచేస్తున్న వారిని ఎన్నుకోవాలి
-రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Minister KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 55 ఏళ్లు పరిపాలించిన మీరు గుడ్డి గుర్రాల పండ్లు తోమారా…? అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పాలన లో నీళ్ళ కోసం ఎంత గోస ఉండేదో తెల్వదా…? అని ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ కాదు 10 ఛాన్స్ లు ఇచ్చారు.. పీకింది ఏంటి అని అడగండని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా చనిపోతే కరంటోళ్లకు ఫోన్ చేసి అన్నా బాయి కాడ స్నానాలు చేయాలే.. దండం పెడతా కరంటు ఇవ్వమని అడిగిన విషయం మరిచిపోవద్దన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట వచ్చే కరంటు కోసం ఎదురుచూసి రాత్రుళ్లు బాయికాడకు పోయి విషకీటకాలు కుట్టి, కరంటు షాక్ కొట్టి రైతులు చనిపోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎరువులు దొరకలే, విత్తనాలు దొరకలే.. ఆఖరికి బ్యాంకులోల్లు వచ్చి తలుపులు, కిటికీలు ఎత్తుకుపోయారని అన్నారు. ఎండాకాలం వచ్చిందంటే కౌన్సిలర్లు, జడ్పీటీసీ, సర్పంచ్ ఆఖరుకు ఎమ్మెల్యేలకు సైతం భయం ఉండేదన్నారు. గ్రామాల్లోకి వెళితే నీళ్ల కోసం ఆందోళన చేసేవారన్నారు. కాంగ్రెస్ హయంలో కరంటు ఉంటే వార్తని బీఆర్ఎస్ హయాంలో కరంటు పోతే వార్తని స్పష్టం చేశారు.
ఒక్కరోజులో 2 వేల కోట్లతో సిమెంట్ పరిశ్రమ విస్తరణకు భూమి పూజ చేశామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. త్వరలో బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 350 ఎకరాలలో ఆహార శుద్ది పరిశ్రమలకు 27 కంపెనీల కేటాయించిన 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శిలాఫలకం వేశామన్నారు. ఒక్కరోజులో 114 కోట్ల 89 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ, పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఎంతో మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని స్పష్టం చేశారు. నాట్ల సీజన్ వస్తే చాలు డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నాయని, అప్పుడు మీ సెల్ఫోన్లు టింగ్ టింగ్ మంటున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతుబంధు కోసం ఎవ్వరికి రూపాయి లంచం ఇచ్చే అవసరం లేదన్నారు. సింగరేణిని విస్తరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సింగరేణి కార్మికులకు వడ్డీ లేని 10 లక్షల రుణం ఇస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ రైతుల ఆదాయం డబుల్ అవుతుంది అన్నాడు.. కాలేదని ఎద్దేవా చేశారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ వాళ్ళ దోస్తు కోసం పని చేస్తున్నాడని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామన్నారని అవి ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తే మరి ఇక్కడ ఉన్న పిచ్చోడు బండి సంజయ్ ఎందుకు నిరుద్యోగ మార్చ్ చేస్తున్నాడని అన్నారు. మోదీ దేవుడు అని బండి సంజయ్ అంటున్నాడు. ఎవ్వరికి దేవుడు…? ఎందుకు దేవుడు…? అని ప్రశ్నించారు. అన్ని ధరలు పెంచి భారం వెస్తున్నందుకి దేవుడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఎంపీలను గెలిపిస్తే 4 బొగ్గు బ్లాక్ లను అమ్మకానికి పెట్టారని అన్నారు.
ప్రజల కోసం పనిచేస్తున్న వారిని ఎన్నుకోవాలని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోసారి సీఎం కేసీఆర్ కావాలన్నారు. మంచి నాయకులను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ,ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య,సక్కు, కోనప్ప, దివాకర్ రావ్, రేఖ శ్యామ్ నాయక్,ఎమ్మెల్సీ దండే విఠల్,మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జడ్పి ఛైర్మన్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు