ఇక్కడ టిక్కెట్ డిక్లేర్ చేయలే…
-బెల్లంపల్లిలో అభ్యర్థిని ప్రకటించని మంత్రి కేటీఆర్
-దుర్గంపై అనాసక్తినా..? లేక పోటీ ఎక్కువుందనా..?
-కేటీఆర్ పర్యటన తర్వాత సాగుతున్న చర్చ
-బీఆర్ఎస్ క్యాడర్లో పెరుగుతున్న అనుమానాలు
-ఎప్పటికైనా తమ నేతకే టిక్కెట్టు అంటున్న చిన్నయ్య అభిమానులు

Tension over Bellampally MLA ticket: కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ.. అటు ఆరిజన్ వ్యవహారం.. ఆయన అనుచరులపై భూ కబ్జాల ఆరోపణలు.. ఇలా ఏదో రకంగా మీడియాలో నిత్యం నానుతున్నారు. ఇలా కాదని అధినేతను పట్టుకొస్తే అనే ఆలోచనతో ఆయనను పట్టుకొచ్చారు.. ఆయన అంతటా టిక్కెట్లపై ప్రకటన చేస్తున్నారు.. ఇక్కడ కూడా చేస్తారనే అనుకున్నారు.. ఆయన పర్యటనతో మేలు జరుతుందని భావించారు. కానీ, కేటీఆర్ ఆ ప్రకటన చేయకుండానే వెళ్లిపోయారు..
తెలంగాణలో కొద్ది రోజులుగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. అభ్యర్థుల విషయంలో ఒకడుగు ముందుకేసిన బీఆర్ఎస్.. ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు విషయంలో క్లారిటీ ఇస్తూ వస్తోంది. పలు చోట్ల ఏకంగా క్యాండేట్లను ప్రకటించేస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డిని ప్రకటించి.. తాజాగా మంత్రి కేటీఆర్ మరో ఇద్దరు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. హుస్నాబాద్‌లో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వీ.సతీష్‌ను ప్రకటించారు. అక్కడే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌కుమార్ పోటీ చేస్తారని చెప్పారు. మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసేది దాస్యం వినయ్ భాస్కరేనని క్లారిటీ ఇచ్చారు. రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇలా ప్రకటిస్తూ వస్తున్న కేటీఆర్ బెల్లంపల్లిలో సైతం టిక్కెట్లపై ప్రకటన చేస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సైతం ఇదే భావించి ఉంటారు. కానీ, మంత్రి కేటీఆర్ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే వెనుదిరిగారు. దుర్గం చిన్నయ్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ముఖ్యంగా ఆరిజన్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగింది. తన వద్దకు అమ్మాయిలను పంపిచమన్నారని ఆ సంస్థ నిర్వాహకురాలు షెజల్ చేసిన ఆరోపణ దుమారం రేపింది. అయితే, అదంతా అబద్దమని దుర్గం చిన్నయ్య కొట్టిపారేశారు. అయినా, ఆయనకు రాజకీయంగా జరగాల్సిన డ్యామేజీ జరిగిందని అంతా భావిస్తున్నారు.
అదే సమయంలో, దళితబంధుపై సైతం బెల్లంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో సైతం ఎవరికీ డబ్బులు ఇవ్వకండి అని చేసిన ప్రకటన సైతం నర్మగర్భంగా ఇక్కడి నేతలను ఉద్దేశించే అన్నారని స్పష్టం అవుతోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ మరో మాట కూడా అన్నారు. మీ ఎమ్మెల్యే పేరు చిన్నయ్య అయినా చేసేవి పెద్ద పనులు అన్న మాట సైతం ఎలా అర్దం చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఇలా చాలా రకాల వ్యవహారాల నేపథ్యంలో ఇక్కడ టిక్కెట్టుపై ప్రకటన చేయలేదని అర్దం అవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున పోటీ ఉంది. దాదాపు ఐదు మంది వరకు టిక్కెట్ల కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోటీ నేపథ్యంలో కేటీఆర్ ప్రకటన చేయలేదా..? అనే కోణంలో సైతం చర్చ సాగుతోంది.
ఇక రాజకీయంగా మిగతా పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తి చూపుతున్నారు. దీంతో బెల్లంపల్లి మొదటి నుంచి సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సీటు వారికే కేటాయించే అవకాశాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే చిన్నయ్య అనుచరులు మాత్రం మరోలా చెబుతున్నారు. కేవలం అక్కడ ఉన్న రాజకీయ కోణంలోనే ముందుగా టిక్కెట్ల ప్రకటన చేశారు తప్ప, ఇప్పుడు మిగతా చోట్ల అలాంటివి ఏమీ ఉండవని స్పష్టం చేస్తున్నారు. బెల్లంపల్లి తర్వాత రామగుండం పర్యటనలో కూడా మంత్రి కేటీఆర్ టిక్కెట్టు కోసం ప్రకటన చేయలేదని వారు ఉదాహరణ చూపిస్తున్నారు. బెల్లంపల్లిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన తమ నేతకు టిక్కెట్టు ఖచ్చితంగా దక్కుతుందని చెబుతున్నారు.
ఏది ఏమైనా మంత్రి కేటీఆర్ పర్యటన తనకు కలిసి వస్తుందని అనుకున్న దుర్గం చిన్నయ్యకు ఒక రకంగా ఆశాభంగం ఎదురైంది. రాజకీయంగా ఎన్నో ప్రశ్నలు లెవనెత్తింది. కొద్ది రోజుల్లో ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. అయితే, అది దుర్గం చిన్నయ్యకు అనుకూలంగనా..? ప్రతికూలంగనా..? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.