ఒకే ఒరలో రెండు కత్తులూ ఇమిడాయి..
సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు.. అదే టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తున్న నేత మరొకరు.. వారిద్దరూ కలిసి ప్రజల్లోకి వెళుతూ నవ్వుతూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు.. గతంలో ఎన్నడూ కలవని నేతలు కలిసి వెళ్తున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులూ ఇమిడాయి.. ఇంతకీ ఏం జరిగింది…? వీరిద్దరూ కలిసి వెల్లడం వెనక రహస్యమేంది..?
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ రెండు రోజులుగా బెల్లంపల్లి పట్టణంలో తిరుగుతూ ప్రజలకు పట్టాలు అందిస్తున్నారు. ఇందులో వింతేముంది. వారు ప్రజల కోసం, పార్టీ కోసం తిరుగుతున్నారు కదా..? అనుకోవచ్చు. కానీ, దాని వెనక చాలా పెద్ద కథే ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నాలుగు రోజుల కిందట మంత్రి కేటీఆర్ బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు. ఆయన వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. చాలా చోట్ల సిట్టింగ్ లకు టిక్కెట్టు ప్రకటిస్తూ వస్తున్న కేటీఆర్ బెల్లంపల్లిలో మాత్రం టిక్కెట్ పై మౌనం వహించారు.
దీంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ మీరు జనంలోకి వెళ్లాలని పనిచేయాలని సూచించారు. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ను సైతం పిలిచి ఇద్దరూ కలిసి బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఏడు వేల పట్టాల పంపిణీ చేయాలని, ప్రతి ఇంటికీ తిరిగాలని కోరారు. రోజు ఫోటోలు సైతం తనకు పంపించాలని అక్కడే ఆదేశాలు జారీ చేశారు.
వారిద్దరూ కలిసి తిరుగుతున్నారా లేదా..? ప్రజల్లో ఉంటున్నారా..? లేదా..? ఎప్పటికప్పుడు తనకు ఫొటోలు పంపించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి బాధ్యత అప్పగించారు.