పక్కలో బల్లాలు
-ఎమ్మెల్యేలకు కంటిలో నలుసులా సొంత పార్టీ నేతలు
-వారు సైతం టిక్కెట్ల కోసం పోటీ చేయడమే కారణం
-నియోజకవర్గంలో ప్రతిదీ అధిష్టానం దృష్టికి
-మీడియాకు సైతం లీకులు వారి పనే
-తమ సీటుకే ఎసరు పెడుతుండటంపై సిట్టింగ్‌లు గుర్రు
BRS: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్‌లకు సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురవుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. అక్రమాలు, అవకతవకలు, అత్యుత్సాహం, వసూళ్లు ఇలా ఎమ్మెల్యేకు సంబంధించిన ఏ విషయమైనా ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న విషయమైనా అధిష్టానానికి చేరవేస్తున్నారు. మీడియాకు సైతం లీకులు ఇస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సిట్టింగ్‌లు తమకు పక్కల్లో బల్లెంలా మారిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర ఉండటంతో వారిపై అక్కసు బయటపెట్టుకోలేక లోలోన మదనపడుతున్నారు.
-ఈ విషయంలో ఏకంగా మంత్రికే తిప్పలు తప్పడం లేదు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి నియోజకవర్గంలో పోటీ తప్పడం లేదు. ఆయనకు కొత్త తలనొప్పులు ఉద్యమకారులను విస్మరించాడంటూ శ్రీహరిరావు ఏకంగా లేఖ విడుదల చేశారు. తోకలు, తొండాలకు మాత్రమే పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు కాదు ఆత్మీయత లేని సమ్మేళనాలు అంటూ ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా అటు శ్రీహరిరావ్, సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. పార్టీలో ఉన్న అసంతృప్తులను ఏకం చేసే పనిలో శ్రీహరిరావ్ ఉన్నారు. ధన అహంకార, అసమర్థ, ఆత్మగౌరవ తిరుగుబావుటా పేరుతో మంత్రికి వ్యతిరేకంగా శ్రీహరిరావ్ సమావేశాలు సైతం నిర్వహించారు. అసమ్మతి ముల్లు ఎక్కడ గుచ్చుకుంటుందోననే మంత్రిని భయం వెంటాడుతోంది. ఉంటే ఉంటా లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అధిష్టానం ఎవరికి చెబితే వారికే టిక్కెట్టు అంటూ ఓ సమావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అది పెద్దగా పండలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రికి ఇద్దరి నుంచి అసమ్మతి ఉండంతో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
-మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్‌రావు ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ సైతం కన్నేశారు. గతంలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా సైతం పురాణం పనిచేసిన నేపథ్యంలో ఆయనకు పరిచయాలు బాగానే ఉన్నాయి. ఆ పరిచయాలతోనే టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ నేతలతో పరిచయాలు పెంచుకునేందుకు ముందుకు సాగుతున్నారు. దీంతో సహజంగానే నడిపెల్లికి అది కోపం తెప్పిస్తోంది. అదే సమయంలో కొందరు బీసీ నేతలు సైతం టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్టు తమకే వస్తుందనే ధీమాతో చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు.
-బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా, ఇక్కడ ఎన్నో ఏండ్లుగా టిక్కెట్టు ప్రయత్నిస్తున్న తెలంగాణ ఉద్యమ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ సైతం ఈసారి గట్టిగానే టిక్కెట్టు కోసం పోటీలో ఉన్నారు. ఎలాగైన టిక్కెట్టు సాధించుకునేందుకు జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రాజకీయ గురువు బాల్క సుమన్ ద్వారా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రవీణ్‌కు ఇద్దరికి పొసగదు. ఇక్కడ టిక్కెట్టు కోసం మరో ఐదుగురు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. దుర్గం చిన్నయ్యకు సంబంధించి ఎన్నో అంశాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం వెనక ఇక్కడ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న కొందరు నేతలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
-ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సైతం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవలక్ష్మి ఈసారి టిక్కెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తనకే టిక్కెట్టు అని అభిప్రాయం సైతం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో, ఇతర విషయాల్లో ఆమె ఎమ్మెల్యే సక్కుకంటే ముందే ఉంటారు. ఆత్రం సక్కు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. ఆయన స్థానికంగా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు హైదరాబాద్ వెళతారో తెలియని పరిస్థితి. ఆయన ఇంటి ముందు ఎప్పుడు సైలెంట్‌గా ఉంటే, కోవలక్ష్మి ఇంటి ముందు జనంతో కళకళలాడుతుంది. తనకు కంటిలో నలుసులా తయారైన కోవలక్ష్మిని పక్కకు పెట్టించేందుకు సక్కు చాలా ప్రయత్నాలు చేశారు. అయినా, అది కుదరలేదు. ఇప్పుడు ఆయనకే టిక్కెట్టు కోసం పోటీలో కోవలక్ష్మి నిలబడింది.
-కోనేరు కోనప్పకు సైతం ఒక భయం వెంటాడుతోంది. ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూరు నియోజకవర్గం టిక్కెట్టు రేసులో ఉంటారనేది ఆయనకు ఉన్న అనుమానం. ఆయన బీసీ నేత కావడంతో పాటు అధినేత కేసీఆర్ దగ్గర కావడం కూడా కారణమనే ప్రచారం సాగుతోంది. కోనప్ప తోక ఝాడిస్తే దండేవిఠల్ పోటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కోనప్ప అంటే పడని వర్గం ఈయన పేరును తెరపైకి తీసుకువస్తోంది.
-బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు సొంత పార్టీ నేతలే ఫిట్టింగ్ పెడుతున్నారు. ఏకంగా ఆత్మీయ సమ్మేళనమే ఒకే రోజు రెండు వేదికల ద్వారా జరిగిందంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ రాథోడ్ బాపూరావుకు ఎంపీపీ తులా శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎమ్మెల్యేకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలే చాలా మంది దూరంగా ఉంటారు. మాజీ ఎంపీ నగేష్ ఈ వ్యవహారం మొత్తం వెనక ఉండి నడిపిస్తున్నారని రాథోడ్ బాపూరావు వర్గం ఆరోపిస్తోంది.
-ముథోల్‌లో విఠల్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ఉన్నారు. ఆయన కూడా టిక్కెట్టు కోసం కన్నేశారు. దళితబంధు కేవలం ఎమ్మెల్యే అనుచరులకే ఇస్తున్నారని, ఆయన సోదరుడు సూర్యం షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ వేణుగోపాలాచారి వర్గం చేయిస్తోందని విఠల్‌రెడ్డి వర్గం ఆరోపిస్తోంది.
-ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖా నాయక్ కు సైతం అసమ్మతి పోటు తప్పడం లేదు. ఇక్కడ టిక్కెట్టు కోసం మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్ జాన్సన్ నాయక్, సంతోష్‌రావు స్నేహితుడు పూర్ణ నాయక్ సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి విషయాన్ని అధిష్టానానికి చేరవేయడంలో ఈ ఇద్దరి పాత్ర ఉందని ఎమ్మెల్యే అనుచురులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట చెరువు, భూ కబ్జా విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం బయటికి పొక్కడంతో ఎమ్మెల్యే వర్గం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీని వెనక జాన్సన్ నాయక్, పూర్ణ నాయక్ ఉన్నారనే ప్రచారం సైతం ఎమ్మెల్యే వర్గం తెరపైకి తీసుకువచ్చింది.
-ఆదిలాబాద్ జోగు రామన్నకు సొంత పార్టీలోనే పోటీదారులు ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మనీషా, పార్టీ సీనియర్ నేత బాలూరి గోవర్థన్ రెడ్డి తదితరులు టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది బయటకే తిరుగుతున్నారు. కొందరు మాత్రం చాప కింద నీరులా ఏం చేయాలో అది చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే జోగురామన్న వారిపై కన్నేసి ఉంచారు.
ఇలా ఎమ్మెల్యేలు, టిక్కెట్టు ఆశిస్తున్న వారు ఒకరిపై ఒకరు కన్నేసి ఉంచడంతో ఆయా నియోజవర్గాల్లో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యేలు అటు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు, టిక్కెట్టు ఆశిస్తున్న వారిపై సైతం కన్నేశారు. అదే సమయంలో వారి లొసుగులు వీరు, వీరి లొసుగులు వారు బయటపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇదంతా ఒక్కెత్తు కాగా, అధిష్టానం నియోజవకర్గాల వారీగా ఏం జరుగుతోంది..? సిట్టింగ్ లు, అసమ్మతి నేతలు ఏం చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.