వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృత్యువాత
Boy dies after being attacked by stray dogs: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృత్యువాత పడ్డాడు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తర ప్రదేశ్కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు కాజీపేట రైల్వేస్టేషన్ వచ్చారు. వంట చేసుకునేందుకు పక్కనే ఉన్న రైల్వే కాలనీలోని పార్కుకు వచ్చారు. రాత్రి పడుకుని ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్నారు. వారి కుమారుడు ఎనిమిదేళ్ల చోటు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. దాదాపు 15 నిమిషాల పాటు అతనిపై దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన చోటు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కాజీపేట, వరంగల్ నగరాల్లో పర్యటించనున్నారు. అదే సమయంలో ఘటన జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇక్కడ కుక్కల బెడద ఉందని, ఇక్కడే ఇద్దరిపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు చెబుతున్నారు. తాము ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.