మహిళకు సీటిచ్చి… తాను మృత్యు ఒడికి..
-రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డ యువకుడు
-మరో ప్రమాదంలో మహారాష్ట్ర వాసి దుర్మరణం
Accident: తాను కూర్చున్న సీటు ఓ మహిళకు ఇచ్చి రైలు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు ఒక యువకుడు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ ప్రాంతానికి చెందిన ఆవిడపు రోహిత్ (22) కళాశాల చేరేందుకు హైదాబాద్ బయల్దేరాడు. ఉదయం రేచిని రైల్వేస్టేషన్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. మధ్యలో ఓ మహిళ రావడంతో తాను కూర్చున్న సీటిచ్చి నిలబడ్డాడు. బోగి చివరకు వెళ్లి నిలడటం, అక్కడ నిలిచి ఉన్న నీరు చూసుకోకపోడంతో జారి కింద పడ్డాడు. పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే గేటు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోహత్ తండ్రి లక్ష్మణ్ ఐబీ ఏరియాలో టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు. కొడుకు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరో ప్రమాదం మంచిర్యాల జిల్లాలో జరిగింది. మంచిర్యాల తాండూరు మండలం రేపల్లెవాడ దగ్గర గుర్తు తెలియని రైలు నుంచి ఓ వ్యక్తి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో చంద్రాపూర్‌కు చెందిన రతన్ మైసయ్య(37) అనే వ్యక్తి చనిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.