బ్రేకింగ్ మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ మృతి
Maoist Party: మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ మృతి చెందారు. కటకం సుదర్శన్ కేంద్ర కమిటీ పోలిట్‌బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి. గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్టగా చెప్తారు. 42 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 2013లో కాంగ్రెస్ నేతలపై మావోల దాడిలో 27 మంది మరణించారు. ఈ దాడి వెనుక వ్యూహకర్త కటకం సుదర్శన్. ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యం వరకు మావోయిస్టు కార్యకలాపాల్లో సుదర్శన్ కీలకంగా పనిచేస్తూ వస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సుదర్శన్ వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశారు. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లా సీపీఐ(మావోయిస్టు) సెక్రటరీ సాధనను వివాహం చేసుకున్నారు.
1975-1979 ప్రాంతంలో విప్లవోద్యమానికి ప్రభావితమై సుదర్శన్ ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయారు. 42 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచెలంచెలుగా అగ్ర నేత స్థాయికి ఎదిగారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా,పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కిషన్‌జీ ఎన్కౌంటర్ తర్వాత సెంట్రల్ రీజినల్ బ్యూరో ఆఫ్ సీపీఐకి చీఫ్‌గా కూడా పనిచేశారు. సుదర్శన్ ఎన్నోసార్లు పోలీసుల ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్నారు.