ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం
-పోలీసులు పక్షపాతం లేకుండా కేసులు నమోదు చేయాలి
-రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి రొడ్డ శారద
Congress: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరుల వల్ల ఆరిజన్ డైరీ భాగస్వామి షేజల్ అనే అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసిందని ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, డీసీసీ సభ్యురాలు రొడ్డ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల నుంచి తనను వేధింపులకు గురి చేస్తూ తప్పుడు కేసులు బనాయించి తనను వేధిస్తున్నారని పోలీసులకు ఆధారాలు చూపెట్టినా పోలీసులు కనీసం పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టారు. ఢిల్లీ మహిళా కమిషన్, మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన ఆమెపై ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేశారని శారద ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకునే ముందు కూడా షేజల్ లేఖ రాసిందని దానిపై కూడా కేసు పెట్టలేదని, చర్యలు తీసుకోలేదన్నారు.
అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు న్యాయం చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళలు అని చూడకుండా అసభ్య పదజాలంతో మాట్లాడం, గ్రూపుల్లో ఛాటింగ్ చేయడం ఎంత వరకు సమంజసమని రొడ్డ శారద ప్రశ్నించారు. అసలు ఆరిజన్ వివాదంలో మీరు వారితో విందులు వినోదాలు విలాసాలు ఎందుకు పాల్గొన్నారో బయటపెట్టాలని ఆమె ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ప్రశ్నించారు. ఆరిజిన్ డైరీ మోసాలు చేస్తే అందులో ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలి…? కానీ కక్ష కట్టి ఇద్దరిపై మాత్రమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం తరువాత కూడా వాళ్ళని బెదిరించడం వెనుక ఎం జరిగిందని ప్రశ్నించారు. పోలీసులు తగిన విచారణ చేసి ఎమ్మెల్యే ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని శారద హెచ్చరించారు.