శభాష్ మీనా..
-ఒడిలో బిడ్డతో మట్టి లారీ అడ్డుకున్న మహిళా అధికారి
-ఆమె ధైర్యానికి అందరూ ఫిదా
Palmarru VRO Meena: ఒడిలో 10 నెలల చంటిబిడ్డ.. అక్రమం జరుగుతోందని సమాచారం వచ్చింది.. తన విధి నిర్వహణ గుర్తుకు వచ్చింది. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చంటి బిడ్డతో అలాగే బయల్దేరింది. తన స్కూటీతో ఛేజింగ్ చేసి మరీ ఆ లారీని పట్టుకుంది. ఇప్పుడు ఆమె ధైర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు.
మట్టి మాఫియా అడ్డు వచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరు. గతంలో ఎంతో మంది వీరి అరాచకానికి బలయ్యారు. మట్టి మాఫియా అంటే పెద్ద పెద్ద అధికారులు సైతం భయపడతారు.. వారిపై కనీసం చర్యలు కూడా ఉండవు. కానీ, ఈ మహిళా అధికారి ప్రదర్శించిన ధైర్య సాహసాలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు సమీపంలో కొంతకాలంగా అనుమతులు లేకుండా మట్టి దిబ్బల నుంచి మట్టిని తవ్వి లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం వచ్చింది. వెంటనే వీఆర్వో మీనాకు విషయం తెలిసింది.. ఆమెకు 10 నెలల బిడ్డ చేతుల్లో ఉన్నాడు. అయినా సరే ఆమె తన బిడ్డను ఎత్తుకుని లారీని అడ్డుకోవడానికి వీఆర్వో మీనా తన పసిబిడ్డను తీసుకుని స్కూటీపై బయల్దేరి వెళ్లారు. తన బిడ్డను పొట్టకు అట్టిపెట్టుకుని మరీ ఆ లారీని ఆపేశారు.
వీఆర్వో మీనా కొత్తూరులో రెండు వాహనాలను సీజ్ చేశారు.. వారికి జరిమానా కూడా విధించారు. మైనింగ్ మాఫియాను ఎంతో ధైర్యంగా అడ్డుకున్న ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విధి నిర్వహణ విషయంలో ఆమెకు ఉన్న ధైర్యం, నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీఆర్వో మీనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. తనతో పాటూ చంటి బిడ్డతోనే ఆమె మట్టి మాఫియా అడ్డుకున్న తీరు పొగిడేస్తున్నారు. ఇప్పుడు మీనా ఓ సెలబ్రిటీ అయ్యారు.. పామర్రు వీఆర్వో మీనా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.