బండ కింద బతుకులు ఛిద్రం
గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి - గని వద్ద ఉద్రిక్త పరిస్థితి - ఆందోళన చేస్తున్న కార్మికుల బంధువులు

వాళ్లకేందీ జీతాలు ఫుల్.. కార్మికుల డబుల్ ధమాకా.. జీతం, బోనస్, అడ్వాన్స్ అన్ని కలిపి లక్షకు పైనే… జీతాలు సరే మరి జీవితాల మాటేంటి.. సింగరేణి కార్మికులు నిత్యం జీవితంతో పోరాటం చేయాల్సిందే. గనిలోకి వెళ్లింది మొదలు బయటకు వస్తారో.. రారో తెలియని పరిస్థితి. బతుకు ఫణంగా పెట్టి బొగ్గును వెలికి తీస్తూ తమ జీవితాలు చీకట్లో నెట్టుకుని మనకు వెలుగులు నింపుతున్నారు చీకటి సూరీళ్లు.
సింగరేణి బొగ్గు గనిలో విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ 3 గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. బొగ్గు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు. మరో రెండు గంటలు పట్టే అవకాశముందని తోటి కార్మికులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు. మైన్‌లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. మృతి చెందిన కార్మికులు కృష్ణారెడ్డి (59), సూర్య నర్సింహరాజు (30), లక్ష్మయ్య (60), చంద్రశేఖర్ (29) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
మృతుడు చంద్రశేఖర్ శవం బయటకు తీశారు. మృతుల కుటుంబాలు,బంధువులు గని వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై గని అధికారులు విచారణ చేపట్టారు. శ్రీరాంపూర్ పోలీసులు సంఘటన జరిగిన గని వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు త్వరగా చేపట్టాలని మృతుల బంధువులు గనిపై ఆందోళన చేస్తున్నారు.