మ‌త్తు వ‌ద‌లిస్తారా..?

గిరిజ‌న గ్రామాల్లో గంజాయి ఘాటు గుప్పు - ఇప్ప‌టికీ తాండూరు మండలంతో పాటు ప‌లుచోట్ల‌ సాగు - కొద్ది రోజులు హ‌డావిడి చేసిన పోలీసు శాఖ‌ - ప‌త్తాలేని ఎక్సైజ్ శాఖాధికారులు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి ఘాటు గుప్పుమంటోంది. ఇక్క‌డ అంత‌ర్‌పంట‌గా కొంద‌రు వ్య‌క్తులు సాగు చేస్తుండ‌గా, గిరిజ‌న గ్రామాల్లో ముఖ్యంగా అట‌వీ ప్రాంతాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ గంజాయి సాగు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం మేర‌కు పోలీసు అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించినా దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ఇక ఎక్సైజ్ అధికారులు ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ,సాగుకు కేరాఫ్ గా మారుతోంది..యువత గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. దీన్ని ఆసరగా చేసుకుని కొంతమంది చిన్నచిన్న ప్యాకేట్లుగా తయారు చేసి పట్టణ ప్రాంతాలతోపాటు పలు చోట్ల విక్రయిస్తున్నారు. చాలా చోట్ల గంజాయిని అంత‌ర‌పంట‌గా సాగు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విష‌యంలో సీరియ‌స్‌గా తీసుకుని అరిక‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ మేర‌కు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. వారం రోజుల పాటు పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించారు. ఆ మేర‌కు గంజాయి అమ్మేవాళ్లు, కొనేవాళ్ల‌పై దృష్టి పెట్టి మ‌రీ అరెస్టులు చేశారు. అంతేకాకుండా ప‌లు చోట్ల గంజాయి మొక్క‌ల‌ను ధ్వంసం కూడా చేశారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని పంటల్లో అంతర్ పంటగా సాగుచేస్తున్నా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తువీడడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. క్షేత్ర స్థాయిలో ఏం జరగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులకు సమాచారం వస్తే గాని ఎక్సైజ్ సిబ్బంది కార్యాలయం నుంచి కదలడం లేదు. వరుస బెట్టి గంజాయి రవాణా దారులను పోలీసులు అరెస్ట్ లు చేస్తుంటే ఎక్సైజ్ అధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం ఉమ్రి శివారు పత్తి పంటల్లో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తుండగా పోలీసులు గుర్తించి 70 కిపైగా గంజాయి మొక్కలు ధ్వంసం చేశారు… వివిధ మండలాల్లోని పలు గ్రామాల్లోని పంటల్లో గంజాయి సాగుఅవుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదనేది ఇటీవల చేనుల్లో గుర్తించిన గంజాయి చెట్లే సాక్ష్యం. బజార్ హత్నూర్ మండలంలోని పోలీసులు అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశారు.

ఆదిలాబాద్ మంచిర్యాల ,నిర్మల్ ,కొమురం భీం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్క్షెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన ఐదుగురు కొమరం భీమ్ జిల్లాలోని తిర్యాణి మండలం పగిడి మాదారం గ్రామానికి చెందిన మరొకరిని అరెస్ట్ చేశారు..వారి వద్ద ఎండు గంజాయి స్వాదీనం చేసుకోగా పట్టుబడ్డ వారిలో ఇద్దరు మైనర్లు దొరికారు.. మంచిర్యాల జిల్లాలోని చాలా మండలాల్లో గంజాయి మత్తులో యూత్ తూగుతున్నారనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు.. ఆదిలాబాద్ జిల్లా మీదుగా చాక్లెట్ కవర్లలో ప్యాకింగ్ చేసి కార్ల‌లో ప్రత్యేకంగా తయారు చేసిన సీట్లలో గంజాయి తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది.

ఇటీవలనే కొమురం భీం జిల్లాలో పోలీసులు ఎండుగంజాయిని పట్టుకున్నారు…వాంకిడి మండలంలో 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతోపాటు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయికి అలవాటుపడ్డ యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పలు గ్రామాల్లో కొంతమంది గుట్టు చప్పుడు గంజాయి చేరవేస్తున్నారు.నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సైతం విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం.. ఈ మేర‌కు నిఘా పెట్టామంటున్నారు పోలీసులు. ఇక బెల్లంప‌ల్లి ప్రాంతంలో సైతం గంజాయి సాగు చేస్తున్న వారిని, అమ్ముతున్న వారిని పోలీసులు ప‌ట్టుకుని కేసులు న‌మోదు చేశారు. బెల్లంప‌ల్లి ఏసీపీ ఎడ్ల మ‌హేష్ ఆధ్వ‌ర్యంలో ఈ దాడులు కొన‌సాగాయి.

అయితే ముఖ్య‌మంత్రి సూచ‌న‌ల మేర‌కు కొద్ది రోజులు హ‌డావిడి చేసిన పోలీసులు ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. చాలా చోట్ల ఈ గంజాయి ఇంకా సాగుచేస్తున్నారు. తాండూరు మండ‌లం బెజ్జాల‌, న‌ర్సాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఈ గంజాయి సాగు చేస్తున్నారు. అట‌వీ ప్రాంతాలు కావ‌డంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అటు వైపు చూడటం లేదు. అంతేకాకుండా కొమురంభీమ్ జిల్లాలో సైతం జోడేఘాట్ ఇత‌ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఈ గంజాయి సాగు చేస్తున్నారు. అమాయ‌క గిరిజన ప్ర‌జ‌ల‌ను ఆస‌రాగా చేసుకుని దానిని కొంద‌రు ద‌ళారులు అమ్ముకుంటున్నారు. మాదారం టౌన్‌షిప్‌తో పాటు గోలేటీ ప్రాంతాల్లో యువ‌కులు మ‌త్తుకు బానిస‌లై వాటిని సేవిస్తున్నార‌ని ప‌లువురు చెబుతున్నారు.

ఇలా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి సాగు చేస్తున్నారు. దానిని స్థానికంగానే కాకుండా హైదరాబాద్ , వరంగల్ ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.. ఎక్కడైనా గంజాయితో పట్టుబడి అరెస్ట్ అయితే అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నార‌నే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. స్థానికంగా పోలీసులకు చిక్కిన వారే కాకుండా పక్కజిల్లాల్లో సైతం ఇక్కడి వారే పట్టుబడుతుండడం గ‌మ‌నార్హం. ఇక్క‌డి నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలిపోతున్నా ఎవ్వరికి ప‌ట్టింపు లేకుండా పోయింద‌నే ఆరోపణలున్నాయి.. మరి ఇంత జరుగుతుంటే ఎక్సైజ్అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like