బేల @ 6.6 డిగ్రీలు
తెలంగాణ (Telangana)పై చలిపులి (Coldwaves) పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా బేలలో 6.6 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్(యు)లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3, మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో 12.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.
గాలుల వల్లే తగ్గుతున్న ఉష్ణోగ్రతలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పెరిగిపోతున్న చలి తీవ్రత నుండి కాపాడుకునేందుకు ప్రజలు చలి మంటలు కూడా కాస్తూ ఉపశమనం పొందుతున్నారు. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న గాలులతోనే చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతాల్లో జీవనంపై ప్రభావం..
ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో జనజీవనంపై ప్రభావం చూపుతుంది. పంట పొలాల్లో రైతులు పంటకు నీరివ్వడం, చెట్లు, చెరువులు ఉన్న ప్రాంతాల్లో చలికి జనం అల్లాడిపోతున్నారు. చలి తీవ్రతకు వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం చలి మంటలు కాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెల్లవారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పూట పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి..
ఏజేన్సీ ప్రాంతంలోని గ్రామాల చుట్టు అడవులు, కొండలు ఉండటంతో పొగమంచు కమ్ముకొని జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో బయటకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇంకా కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం పూట విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాకర్లు కూడా వణికిపోతున్నారు. పిల్లలు, వృద్దులు కూడా అవస్థలు పడుతున్నారు. ఉదయం పూట పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగ రీత్యా రాకపోకలు సాగించే ఉద్యోగులు కూడా చలితో అవస్థలు పడుతున్నారు.