ఎమ్మెల్యేల కొట్లాట
మంత్రుల ముందే తోసుకున్న పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్
MLA Sanjay Vs KowsikReddy: జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య గొడవ, తోపులాటతో సమావేశం రసాభాసగా మారింది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒకరినొకరు తోసుకోవడం సంచలనం రేపింది. జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతుండగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలుగజేసుకుని మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్‌రెడ్డి హల్‌చల్ చేశారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా, ఏ పార్టీనో ముందు చెప్పి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ మైక్‌లో మాట్లాడుతుండగా అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడే ఉన్న నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు లాక్కెళ్లారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఎదుటే ఈ గొడవ జరిగింది. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరా బాద్ నియోజకవర్గంలో 50 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు. వెంటనే మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 18,500 కుటుంబాలకు దళితబంధు ఇచ్చినట్లు గుర్తుచేశారు. తక్షణమే రెండో విడత దళితబంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.