శాంతి చ‌ర్చ‌ల‌కు మేం సిద్ధం

మావోయిస్టు పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Maoist party:శాంతి చ‌ర్చ‌ల‌కు తాము సిద్ధ‌మ‌ని మావోయిస్టు పార్టీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామ‌ని ఆ లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలో జరుగుతున్న హత్యాకాండను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే, కాల్పుల విరమణను ప్రకటిస్తామని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టులు విడుద‌ల చేసిన లేఖ య‌దాత‌థంగా.. ‘మధ్యభారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, భారత ప్రభుత్వం-సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటు, అది శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా, శాంతి చర్చల పట్ల మా పార్టీ వైఖరిని తెలియజేస్తున్నాం.

కేంద్ర ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ‘కగార్’ పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయి. ఆ సమయంలో ప్రజల్ని మోసగించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి/హోంమంత్రి విజయ్ శర్మ ‘మా ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టులు చర్చలకు రావాలి’ అని పదే పదే ప్రకటనలు చేశాడు. ఆ సందర్భంగా మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ రెండుసార్లు మా పార్టీ శాంతి చర్చలకు సిద్ధమేనని తెలిపాడు. శాంతిచర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం, ‘కగార్’ పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్ లకే పరిమితం చేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశాడు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాలన్నింటా, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో ‘కగార్’యుద్దాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైబడిన సంఖ్యలో మా పార్టీ నాయకులను, కార్యకర్తలను. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి చెందిన వివిధ స్థాయిల కమాండర్లను, సభ్యులను, సాధారణ ఆదివాసీ ప్రజానీకాన్ని హత్య చేశాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే సాధారణ ప్రజానీకాన్ని హత్య చేస్తున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ వ్యతిరేకం. సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ, పీడనలను సుస్థిరం చేయడం కోసమే, ‘హిందూరాష్ట్ర’ ఏర్పాటు కోసమే బీజేపీ పాలిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఇతర రాజకీయ పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. దేశంలోని సకల పీడిత ప్రజలపై, పీడిత సాంఘిక సముదాయాలపై, పీడిత జాతులపై సామ్రాజ్యవాదులు, దళారీ పెట్టుబడిదార్లు, భూస్వాములు సాగించే దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాడుతుంటే, ఈ దోపిడీ పాలకవర్గాల దోపిడీ, పీడనలను సుస్థిరం చేయడానికి బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలపై కగార్ పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. విప్లవోద్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువతి యువకులను సాయుధ బలగాల్లో భర్తీ చేసుకుని వారి చేతనే ఆదివాసులను హత్యలు చేయిస్తున్నాయి.

ఈ స్థితిలో ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన చేస్తున్నాం. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలీ), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యకాండలను, నరసంహారాన్ని (జీనోసైడ్)ను నిలిపివేయాలని, సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం.

మేం చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుక రావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు తదితరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాల్సిందిగా కోరుతున్నాం..

Get real time updates directly on you device, subscribe now.

You might also like