ఆవేద‌న‌కు అర్థ‌ముంది…

ప్రేంసాగ‌ర్ రావు మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తున్న కాంగ్రెస్ నేత‌లు
ఎన్నో ఏండ్లుగా పార్టీని ప‌ట్టుకున్న వాడికే ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్‌
పార్టీలు మారిన వారికి ఇస్తే ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యే అవ‌కాశం
ఒక ఇంటి నుంచి మూడు టికెట్లు.. మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వా..?
సొంత పార్టీలో ప్రేంసాగ‌ర్ రావుకు పెరుగుతున్న మ‌ద్ద‌తు
కాంగ్రెస్ పార్టీ సొంత నిర్ణ‌యాలు తుంగ‌లో తొక్కుతుందా..?

క‌ష్ట కాలంలో పార్టీకి అండ‌గా ఉన్నాను… న‌న్ను క‌ష్ట‌పెట్టొద్దు.. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా..? వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా.. ? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవం…. ఇదీ సోమ‌వారం మంచిర్యాల బ‌హిరంగ స‌భ‌లో ప్రేంసాగ‌ర్ రావు చేసిన వ్యాఖ్య‌లు.. త‌న‌కు మంత్రి రాక‌పోవ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ మాట్లాడారు. అయితే, ఆయ‌న వాస్త‌వాలు మాట్లాడార‌ని ఆయ‌న ఆవేద‌న‌కు అర్థం ఉందంటూ సొంత పార్టీ నుంచే మ‌ద్ద‌తు పెరుగుతోంది…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన‌ప్ప‌టి నుంచి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ప‌ద‌విపై ఉత్కంఠ నెల‌కొంది. ఆ ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే విష‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. మొద‌ట ఆ ప‌ద‌వి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావుకు ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా తెర‌పైకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ వ‌చ్చారు. మొద‌ట అన్నాద‌మ్ములు ఇద్ద‌రికీ టిక్కెట్టు రాద‌నుకున్న స‌మ‌యంలో వారిద్ద‌రూ అధిష్టాన్ని మెప్పించి మ‌రీ టిక్కెట్టు సాధించారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా తిరిగి వివేక్ కొడుకు వంశీకి సైతం ఎంపీ టిక్కెట్టు తెచ్చుకున్నారు.

పార్టీలు మారారు… టిక్కెట్లు సంపాదించారు..
ఒకే ఇంట్లో మూడు టిక్కెట్లు రావ‌డంతో ఇక వారు మంత్రి ప‌ద‌వి ఆశించ‌ర‌ని అంతా భావించారు. కానీ, త‌మ‌కు మంత్రి ప‌ద‌వి కావాలంటూ వివేక్‌, వినోద్ ఇద్ద‌రూ తిరుగుతున్నారు. ఈ మంత్రి పదవి లొల్లి కాస్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరింది. కష్టకాలంలో పార్టీని కాపాడిన ప్రేమ్ సాగర్ రావ్ ఒకవైపు, వివేక్ సోదరులు మరో వైపు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ పోటీ నేప‌థ్యంలో మొదటి దఫాలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కలేదు. ప్రేమ్ సాగర్ రావ్ ముందునుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వినోద్ , వివేక్ ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక్క పార్టీలో ఉన్నారు. ప‌లు పార్టీలు మారిన వీరు చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినోద్, వివేక్ కాకా కుటుంబం అనే కారణంతోనే రెండు టికెట్లు దక్కించుకున్నారు. సోదరులిద్దరు పార్టీలో చేరడం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది అధిష్టానం… కాంగ్రెస్ జోష్ తో పాటు పటిష్టమైన క్యాడర్ శ్రమతో ఆ ఇద్దరు గెలిచారు. ఇక ప్రేమ్ సాగర్ రావ్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పటికీ ఆయన పార్టీతో అంటిపెట్టుకోని ఉండడమే కాదు ఉమ్మడి జిల్లాలో పార్టీని కాపాడారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కోన్నారనేది సొంత పార్టీ క్యాడర్ చెబుతున్నారు.

క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ ను గ‌ట్టెక్కించారు..
పార్టీకోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెకించిది ఎవ‌రంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రేమ్ సాగర్ రావ్ పేరే వినిపిస్తుంది. కాంగ్రెస్‌లో ఏమి లేదని చాలా మంది బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నది పీఎస్ఆర్. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా. ఆ సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శ‌భాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పిప్పిరి నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఉమ్మడి జిల్లాలో 30 రోజుల సుదీర్షకాలం సాగిన యాత్రను సక్సెస్ చేసి రాష్ట్రం కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను మిగతా పార్టీలకు పంపించగలిగారు. భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజ‌య‌వంతం చేయ‌గ‌లిగారు. మంచిర్యాల సభ పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరాతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.

ఒక ఇంటి నుంచి ముగ్గురు.. మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వా..?
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌, ఆయ‌న సోద‌రుడు బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం మంత్రి ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. వీరిద్ద‌రికి టిక్కెట్టు ఇచ్చిన అధిష్టానం ఆ తర్వాత వివేక్ కుమారుడు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చింది.ఇక మళ్లీ అదే కుటుంబంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతుండ‌టం సొంత పార్టీ నేత‌ల‌తో పాటు క్యాడర్ కు సైతం న‌చ్చ‌డం లేదు. ఇప్ప‌టికే కుటుంబ పాల‌న అనే పేరు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రికి ఎమ్మెల్యే టిక్కెట్లు, వారి కుమారుడికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వ‌డమే కాకుండా ఇప్పుడు మ‌ళ్లీ వారిలో ఒక‌రికి మంత్రి ఇవ్వ‌డం అంటే అటు పార్టీ శ్రేణుల‌కు, ఇటు ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలు ఇస్తార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానం పార్టీ విధేయ‌త చూస్తుందా…? పైసల బలం చూస్తుందా…? అనే చ‌ర్చ సాగుతోంది.

కాంగ్రెస్ త‌న నియ‌మాలు తానే ఉల్లంఘిస్తుందా..?
ఇక, నిన్న భ‌ట్టి విక్ర‌మార్క స‌భ‌లో ప్రేంసాగ‌ర్ రావు మాట్లాడిన మాట‌ల‌ను కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ శాతం ఏకీభ‌విస్తున్నారు. ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ప్రేంసాగ‌ర్ రావుకు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి ఇవ్వ‌క‌పోతే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా కార్య‌క‌ర్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో నిర్వ‌హించిన స‌మావేశాల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్టు… ఏదైనా ప‌ద‌విలో ఐదేండ్లు ఉంటే వారు త‌ప్పుకోవాల‌ని ఇలా నిర్ణ‌యాలు తీసుకుంది. ఆ నిర్ణ‌యాలు కాద‌ని మ‌రీ మంచిర్యాల‌లో ఒకే కుటుంబంలో మూడు టిక్కెట్టు ఇచ్చింది. మ‌రి మంత్రి ప‌ద‌వి విషయంలో అదే త‌ప్పు చేస్తుందా…? ప్రేంసాగ‌ర్ రావుకు క‌ట్ట‌బెడుతుందా అన్న‌ది తేలాల్సి ఉంది…

Get real time updates directly on you device, subscribe now.

You might also like